సాగుకు ఎగువ మానేరు నీటిని విడుదల చేయాలని రైతుల ఆందోళన..!
- కామారెడ్డి-సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతుల ధర్నా
- డిసెంబర్ 5లోగా నీటిని విడుదల చేయకుంటే పెద్దఎత్తున ఆందోళన : రైతుల హెచ్చరిక
గంభీరావుపేట, నవంబర్ 27 (విజయక్రాంతి): యాసంగి సాగుకు(Rabi Season Cultivation) ఎగువ మానేరు జలాశయం(Upper Manair Reservoir) నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కామారెడ్డి-సిద్దిపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
నర్మాల, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, గంభీరావుపేట గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నీటి విడుదలకు అనుకూలంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాసంగి పంట సాగుకు నార్లు పోసుకునే సమయం సమీపిస్తున్నప్పటికీ ఎగువ మానేరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
సాగునీరు అందకపోతే వేలాది ఎకరాల్లో పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ మానేరు జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నుంచి కనీసం అర టీఎంసీ నీటిని విడుదల చేసి, ఎగువ మానేరు ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.డిసెంబర్ 5లోగా నీటిని విడుదల చేయకపోతే రైతులందరినీ ఏకం చేసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్సై బాలరాజు ధర్నా దగ్గరికి చేరుకొని రైతులను సముదాయించారు. అనంతరం తహసిల్దార్ మారుతీ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ ధర్నాలో రైతులు ఏడబోయిన రాజు, ఆకునూరి రాజేందర్, తోట్ల మల్లేశం, పెద్దవేణి వెంకట్,గుండెల్లి కళ్యాణ్, పంపరి మహేష్, దాసరి చంద్రం, జక్కుల నవీన్, మల్లేశం, రవీందర్ రావు, వెంకట్, నర్సింలు, నారాయణ, గోపాల్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.