పొలాలు ఎండుతున్నాయ్.. కరెంట్ ఇవ్వండి.!
కరెంటు కోతలపై భగ్గుమన్న రైతన్న..
కామారెడ్డి -సిరిసిల్ల ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో
గంభీరావుపేట,(విజయక్రాంతి): కరెంటు కోసం అన్నదాతలు అరిగోశపడుతున్నారు. విద్యుత్ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన(Farmers Protest) చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు కాలనీ వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై గజ సింగవరం, గోరంటాల, సముద్రాళింగాపూర్, మల్లు పల్లె గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
వరి పంట పొట్ట దశలో ఉన్నదని లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఇలా అయితే అవసరం ఎలా చేసేది అంటూ ఆగ్రహించారు. రోడ్డుపై రైతులు బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ధర్నా స్థలానికి పోలీసులు విద్యుత్ అధికారులు(Electricity officials) చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులకు సరిపడా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాలు విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు పల్లె సర్పంచ్ సత్యం, రాజేశ్వరరావు కాలనీ సర్పంచ్ పిట్ల బాబునాయకులు రాజిరెడ్డి కొమిరిశెట్టి లక్ష్మణ్ భాస్కర్ నర్సింలు అంజిరెడ్డి రాజారాం రమేష్ ఎల్లం ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.