రాజ్యాంగ విలువలు కాపాడాలి

27-11-2026 | 12:12am
  1. చదువుతోనే సామాజిక గౌరవం 
  2. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్మెట రాజు 

ముస్తాబాద్,నవంబర్ 26(విజయక్రాంతి ): పౌరులలో రాజ్యాంగ విలువలు,ప్రాథమిక హక్కులు(Fundamental Rights),విధులపై అవగాహన పెంచడానికి 2015 నుండి ప్రతి ఏటా నవంబర్ 26న అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ,సమన్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను దేశ ప్రజలకు అందించిందన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత రాజ్యాంగ పితామహుడు ప్రపంచం మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.ప్రజలు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ సమ సమాజ నిర్మాణంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకొని భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.విద్య ద్వారా సామాజిక గౌరవం వస్తుందని ఆ దిశగా ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని  ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య, కార్తీక్ రెడ్డి,విష్ణు,గణేష్, బాబు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు