రాజ్యాంగ విలువలే భావి పౌరులకు మార్గదర్శకం
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించిన ప్రగతి విద్యాసంస్థలు
గజ్వేల్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ విలువలు(Values of the Indian Constitution), ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌరుల బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రగతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రగతి సెంట్రల్ స్కూల్ విద్యార్థులు పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా మంజీరా కాన్సెప్ట్ స్కూల్లో నిర్వహించిన మాక్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ప్రజాప్రతినిధుల పాత్రలు పోషిస్తూ మున్సిపల్ పాలన, స్థానిక సమస్యలు, ప్రజా సంక్షేమం, పౌర బాధ్యతలపై చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రశ్నించే తత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సామాజిక బాధ్యతను పెంపొందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ కల్యాణ్ కార్ పద్మాబాయి నర్సింగ్ రావు, గౌరవ అతిథిగా మున్సిపల్ కమిషనర్ పి. గణేష్ రెడ్డి, కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ అంబదాస్ మాట్లాడుతూ విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం కూడా అని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థుల జీవితాల్లో భాగం చేయడమే ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. 'మేకింగ్ ఎడ్యుకేషన్ జాయ్ఫుల్' నినాదంతో నాణ్యమైన విద్యతో పాటు సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు, జీవిత నైపుణ్యాలను అందించేందుకు ప్రగతి విద్యాసంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.