చేవెళ్లలో వేగంగా భూసర్వే..
- పొలాల వద్దకే అధికారులు
- క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరం
- 15 నుంచి 20 రోజుల్లోనే సర్వే నివేదికల అందజేత
- భూభారతిలో భాగంగా ఏడు గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే
- రైతుల హర్షం
చేవెళ్ల, అక్టోబర్ 23 (విజయక్రాంతి): చేవెళ్ల మండలంలో భూసర్వే(Land Survey) ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల వద్దకే నేరుగా సర్వేయర్లు చేరుకుని సర్వే నిర్వహిస్తున్నారు. రైతులను ఫోన్లో సంప్రదించి, వారికి అనుకూలమైన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతుండటంతో కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ దరఖాస్తులకు మోక్షం....
గతంలో చేవెళ్ల మండలంలో భూసర్వే ప్రక్రియ మందకొడిగా సాగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఎప్పుడు సర్వే జరుగుతుందో తెలియక ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రస్తుతం సర్వేయర్‌గా డి. ఆంజనేయులు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దరఖాస్తుల పెండింగ్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. రైతులను నేరుగా సంప్రదించి వారి భూముల వద్దే సర్వే చేస్తుండటంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
త్వరితగతిన నివేదికల సమర్పణ...
భూసర్వే పూర్తయిన వెంటనే సంబంధిత వివరాలతో కూడిన నివేదికలను రికార్డు సెక్షన్‌కు పంపిస్తున్నారు. పనిభారాన్ని బట్టి సాధారణంగా 15 నుంచి 20 రోజుల్లో నివేదికలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం వల్ల భూసర్వే దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుముఖం పట్టింది.
మండలంలో 15 మంది లైసెనస్డ్ సర్వేయర్లకు అనుమతులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్నారు. పరిమిత సిబ్బందే ఉన్నప్పటికీ, సర్వేయర్ ఆంజనేయులు సమన్వయంతో పనులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఏడు గ్రామాల్లో రీసర్వే....
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’భూభారతి’ చట్టంలో భాగంగా చేవెళ్ల మండలంలోని ఏడు గ్రామాలను రీ-సర్వే కోసం ఎంపిక చేశారు. మండలం లో ని నవలాయపల్లి, మీర్జాగూడ, ముడిమ్యాల, ఆలూరు-3, రేగడి ఘనపూర్, కిష్టాపూర్, నంచెరు గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నవలాయపల్లి గ్రామంలో రీ-సర్వే పూర్తికాగా, ప్రస్తుతం ముడిమ్యాల గ్రామ రెవెన్యూ పరిధిలో పనులు జరుగుతున్నాయి. మిగతా గ్రామాల్లోనూ షెడ్యూల్ ప్రకారం సర్వే చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణానికి సంబంధించి స్పష్టత రానుండటంతో భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంది.
అధికారుల ప్రశంసలు...
చేవెళ్ల మండలానికి కొత్తగా వచ్చిన సర్వేయర్ ఆంజనేయులు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని తహసీల్దార్ కృష్ణయ్య కొనియాడారు. ఆయన చక్కటి పనితీరు వల్ల మండలంలో భూసర్వే పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ఇదే జోరు కొనసాగితే పెండింగ్ దరఖాస్తులన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.