తొలిగించిన ఓట్లను పునరుద్ధరించాలి
కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ రాజీనామా చేయాలి
ఎల్బీనగర్, అక్టోబర్ 23 : 'సర్' నోటీసుల('Sir' Notice) పేరుతో అర్హులైన ఓటర్ల ఓటు హక్కు తొలిగిస్తున్నారని, తొలిగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్(Election Commissioner Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జజాల రుద్ర కుమార్, సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా రుద్ర కుమార్, ఆలేటి ఎల్లయ్య, జిల్లా కోశాధికారి కవిత మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 13 కోట్ల 37 లక్షలు, తెలంగాణ రాష్ట్రంలో 48.90 శాతం ఓట్లను అనేక కారణాలతో తొలిగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్ల ఓటు హక్కును తొలిగించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా పనిచేస్తున్న ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెపాక వీరయ్య, హయత్ నగర్ సర్కిల్ కన్వీనర్ చింతపల్లి కృష్ణయ్య, మత్స్య కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తడబోయిన కృష్ణమూర్తి, ఎల్బీనగర్ అడ్డా కూలీ సంఘం అధ్యక్షుడు సీహెచ్ మున్నా, కార్యదర్శి లాట్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గంగరాజు, సహాయ కార్యదర్శి లింగయ్య, కోశాధికారి ఆంధ్ర శీను, నాయకులు జోసెఫ్, భాస్కర్, ఎల్లయ్య, వెంకన్న, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.