విద్యార్థుల భద్రత పట్టదా?

23-10-2026 | 05:00am
  1. ‘ఎంవీఎస్‌ఆర్’ తీరుపై ప్రజాగ్రహం
  2. బడంగ్‌పేట్‌లోని ఇంజనీరింగ్ కళాశాల నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి
  3. రూ.50 లక్షల పరిహారంతో చేతులు దులుపుకొన్న కళాశాల యాజమాన్యం
  4. అనుమతులు, పర్యవేక్షణ కరువైందంటూ అధికారుల తీరుపై మండిపాటు

రంగారెడ్డి బ్యూరో/బడంగ్‌పేట్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఉన్నత చదువుల కోసం కళాశాలకు పంపిన తల్లిదండ్రులకు ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కొండంత శోకాన్ని మిగిల్చింది. నిండు నూరేళ్లు జీవించి, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ఒక యువతి, కళాశాల నిర్లక్ష్య వైఖరి కారణంగా 18 ఏళ్లకే అనంత వాయువుల్లో కలిసిపోయింది. మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని నాదర్గుల్లో ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల(MVSR Engineering College)లో ఇటీవల చోటుచేసుకున్న దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బాధ్యతారాహిత్యం.. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన..

దసరా పండుగ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం కళాశాల ఆవరణలో దాండియా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే, కార్యక్రమం జోరుగా సాగుతున్న సమయంలో వేదిక వద్ద ఏర్పాటు చేసిన అత్యంత భారీ లైటింగ్ ఇనుప ఫ్రేమ్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా విద్యార్థులపై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో సోని అనే విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందగా, దాదాపు 25 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ ఎలాంటి అత్యవసర వైద్య సదుపాయాలు కానీ, ప్రాథమిక చికిత్స విభాగాలు కానీ అందుబాటులో లేకపోవడం కళాశాల యాజమాన్యం యొక్క బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.

రూ.50 లక్షలతో సరిపెట్టే ప్రయత్నం?

సంఘటన జరిగిన వెంటనే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు, చట్టపరమైన చర్యల నుంచి తప్పుకునేందుకు కళాశాల యాజమాన్యం వేగంగా చక్రం తిప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతి చెందిన విద్యార్థిని సోని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించి, ఒప్పందం కుదుర్చుకుని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎంత ధనం ఇచ్చినప్పటికీ కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేరని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

నిధుల సేకరణ పైనే ధ్యాస.. 

వెంట్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ.300 చొప్పున భారీగా రుసుము వసూలు చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. వేలాది మంది పాల్గొనే కార్యక్రమానికి సంబంధించి కనీస భద్రతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, నాసిరకం లైటింగ్ ఫ్రేమ్లు అమర్చడం కేవలం లాభాపేక్ష కోసమేనని స్పష్టమవుతోంది. ‘డబ్బులు గుంజడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రాణ రక్షణపై లేకపోవడం అత్యంత విచారకరం‘ అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపంపై మండిపాటు..

భారీ సంఖ్యలో జనం గుమిగూడే ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేటప్పుడు స్థానిక పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొంది, వారి మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఘటనలో సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

కఠిన చట్టపరమైన చర్యలు..

ప్రమాదానికి కారణమైన కళాశాల యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలి. విద్యాశాఖ, పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో జరిగే ఈవెంట్లకు స్పష్టమైన భద్రతా మార్గదర్శకాలను  అమలు చేయాలి. గాయపడిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యమే సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలి.ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యాసంస్థల ధనదాహానికి అడ్డుకట్ట వేస్తూ, విద్యార్థుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు