ఆటోనగర్ లో చెత్తను తరలించాలి
రాంకీ సంస్థ ప్రతినిధులను హెచ్చరించిన మాజీ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, అక్టోబర్ 23 : ఆటోనగర్ డంపింగ్ యార్డ్(Autonagar Dumping Yard) వద్ద అక్రమంగా డంప్ చేసిన చెత్తను రాంకీ సంస్థ వెంటనే తొలిగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్ పర్సన్ (ఏఐపీసీ), మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ హెచ్చరించారు. మన్సూరాబాద్ డివిజన్ లోని ఆటోనగర్ లో రాంకీ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని 18 కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి మధుయాష్కీ గౌడ్ సందర్శించారు. రోడ్ల వెంట నిర్మాణ, మెడికల్ వ్యర్ధాలు పారబోస్తుండడంతో పాటు పరిమితికి మించి చెత్తను ఆటోనగర్ తీసుకు వస్తున్నారని .. దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వివరించారు. రాంకీ సంస్థ చెత్తను ఏ రోజుకు ఆ రోజే తీసుకువెళ్లాల్సి ఉండగా.. ఆటోనగర్ లో అక్రమంగా నిల్వ చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ స్పందించి.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రాంకీ, అటవీ శాఖ, పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఆటోనగర్ లో పేరుకుపోయిన చెత్త వ్యర్ధాలను రాంకీ సంస్థ వెంటనే తొలిగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హయత్ నగర్, నాగోల్ సర్కిళ్ల నుంచి మాత్రమే చెత్తను ఏ రోజుకు ఆ రోజు తరలించాలన్నారు.
ఫతుల్లాగూడలో మాదిరిగా క్రిమిటోరియాన్ని ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని.. నిధుల మంజూరుపై ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం నుంచి వచ్చే వ్యర్ధాల కోసం ఎస్టీపీని నెల రోజుల్లోగా పునరుద్ధరించాలని 'ఐలా' కమిషనర్ కు సూచించారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి కార్పొరేషన్ జంతు సంరక్షణ అధికారి డాక్టర్ రంజిత్, ఐలా కమిషనర్ నాగరాజు, ఎఫ్ ఆర్ వో సాయి ప్రకాశ్, పీసీబీ రీజనల్ ఆఫీసర్ వెంకట నర్సు, డీఈ సందీప్, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పృథ్వీ చౌదరి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.