జాతిరత్నం మన్మోహన్‌సింగ్.. భారతరత్న ఇవ్వాలి
- కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్
- నాడు ప్రధానిగా మన్మోహన్ సంతకంతోనే తెలంగాణ ఆవిర్భావం
- దేశ ఆర్థిక పురోగతికి ఆయన నిర్ణయాలే కారణం
- ఢిల్లీలో స్మారక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచన
- గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో మన్మోహన్ కాంస్య విగ్రహావిష్కరణ
రంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చి, దేశ పురోగతికి దోహదపడ్డ మహానుభావుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (Former Prime Minister Manmohan Singh)అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కొనియాడారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కల నెర వేరడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
జాతిరత్నం మన్మోహన్‌సింగ్ అని, ఆయనకు భారతరత్న అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘పదవులకే వన్నె తెచ్చిన మౌనముని మన్మోహన్‌సింగ్. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక మంత్రిగా, దశాబ్దకా లం ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు నడిపించారు’ అని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సర్కిల్ ఆవరణలో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. డా. మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని భావితరాలకు గుర్తుచేసేందుకే ఈ ప్రాంతాన్ని విగ్రహ ఏర్పాటుకు ఎంచుకున్నామని చెప్పారు. నేడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి రంగానికి చోదక శక్తిగా నిలిచిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఐటీ, ఆర్థిక సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుతున్నాయని చెప్పా రు. 1991లో ప్రధాని పీవీ నరసింహారావు హయాం లో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తెచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాల ఫలితమే నేటి హైదరాబాద్ ప్రగతి అని సీఎం వివరించారు.
స్మారక ఫలకంపై మన్మోహన్ సంతకం..
తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని సీఎం ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ‘తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసి స్వాతంత్య్రం అందిస్తే.. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వరాష్ట్ర కలను నిజం చేసిన ఘనత సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌దే.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ నాడు ప్రధానిగా మన్మోహన్ చేసిన చారిత్రాత్మక సంతకాన్ని ఇక్కడి స్మారక ఫలకంపై ప్రత్యేకంగా పొందుపరిచాం’ అని వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సామాజిక విప్లవాన్ని తెచ్చాయన్నారు. ‘రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించి, అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా.
మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో స్మారక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్లపై పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తాలి’ అని సీఎం సూచించారు. ‘రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా 100 శాతం మంది ఆమోదిస్తారని అనుకోలేం. నా పాలనలో నేను తీసుకునే నిర్ణయాలను 51 శాతం మంది ఆమోదిస్తే, దానిని విజయవంతమైన రాజకీయ సూత్రంగా భావిస్తాను.
అయితే, రాజకీయాలకు అతీతంగా నిలిచిన మన్మోహన్ సింగ్ విగ్రహ ఏర్పాటును మాత్రం 100 శాతం ప్రజలు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారని భావిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దూరదృష్టితో నిర్ణయాలు: మంత్రులు
తెలంగాణలో నేడు విస్తరించిన ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల విప్లవానికి నాడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలే మూలకారణమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయాల్లో దూరదృష్టితో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నాయకుడిగా మన్మోహన్ సింగ్ ఇక్కడి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలిపారు.
ప్రగతి పథంలో నడిపారు: జస్టిస్ ఎన్వీ రమణ
డాక్టర్ మన్మోహన్ సింగ్ కేవలం పరిపాలనాదక్షుడే కాకుండా, రాజకీయాలకు అతీతంగా నైతిక విలువలను కాపాడిన అరుదైన నాయకుడని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో రాజ్యాంగబద్ధమైన సంస్థలను, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ దేశాన్ని స్థిరమైన ప్రగతి పథంలో నడిపించారని ఆయన గుర్తుచేశారు.
మాటలు తక్కువ.. పని ఎక్కువ: జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి
యూపీఏ హయాంలో ప్రజాకేంద్రీకృత చట్టాలు రూపుదిద్దుకోవడంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దార్శనికత స్పష్టంగా కనిపిస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘మన్మోహన్‌సింగ్ తక్కువ మాట్లాడి, ఎక్కువ పనిచేసే తత్వంతో దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన నిర్వహించిన బాధ్యతలు భారత చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.