వాయుగుండం ప్రభావం

26-09-2026 | 09:39am

వాయుగుండం తీరం దాటినా.. తెలంగాణపై మేఘాల ముప్పు పూర్తిగా తొలగలేదు!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. వాయుగుండం ఇప్పటికే తీరం దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ.. దాని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే వర్షాల తీవ్రత కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

మరోవైపు వాయుగుండం ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. దాని ప్రభావంతో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉండగా.. తెలంగాణలో మాత్రం వర్షాల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని తాజా వాతావరణ విశ్లేషణలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోనూ సెప్టెంబర్ 26న మోస్తరు వర్షం కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అంటే.. వాయుగుండం వెళ్లిపోయిందని వర్షాలకు పూర్తిగా బ్రేక్ పడినట్టేమీ కాదు. మేఘాల ప్రభావం, గాలుల వేగం కారణంగా పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిది.

మరిన్ని వార్తలు