పీరం చెరువులో పె(గ)ద్దల వేట!
- శిఖం భూమి ఆక్రమించి భారీగా అక్రమ నిర్మాణాలు
- కబ్జాకు గురైన భూమి విలువ రూ.700 కోట్ల పైమాటే..
- కబ్జా వెనుక మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు?
- రెవెన్యూ, ఇరిగేషన్‌ను పక్కనపెట్టి ‘హైడ్రా’ ఫెన్సింగ్
- స్థానికుల తీవ్ర ఆగ్రహం
- సమగ్ర సర్వే తర్వాతే హద్దులు తేల్చాలని డిమాండ్
రాజేంద్రనగర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం(Rajendranagar Constituency) గండిపేట మండలం పీరం చెరువు ఆక్రమణల పర్వం మరోసారి తీవ్ర చర్చనీయాం శంగా మారింది. గండిపేట మండలం పీరం చెరువు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 10లో 34.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు.. ఇప్పుడు రాజకీయ పరపతి కలిగిన బడా బాబుల గుప్పిట్లోకి వెళ్ళి పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన కొందరు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీల అండదండలతో గత కొన్నేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు అక్రమ నిర్మాణాల పర్వం సాగుతోంది.
ప్రజాప్రతినిధులు, వారి బినామీలు ఏకంగా చెరువు శిఖం భూములను ఆక్రమించి, కంచెలు వేసి భారీ నిర్మాణాలకు తెరలేపినట్లు స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. గతంలో ఇరిగేషన్ అధికారులు జరిపిన సర్వేలో ఏకంగా 14.29 ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురైనట్లు తేలింది. అయితే, తాజాగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సంప్రదించకుండానే హైడ్రా చెరువులో కంచె ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. కబ్జాకు గురైన ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం అక్షరాలా రూ.700 కోట్ల పైమాటేనని ప్రజలు అంటున్నారు
ప్లాట్లుగా మారిన ‘శిఖం’.. కోట్లలో వ్యాపారం!
ఒకప్పుడు పచ్చదనంతో, నిండుకుండలా కళకళలాడిన పీరం చెరువు పరిసరాలు కాలక్రమంలో రియల్ ఎస్టేట్ మాఫియాకు కామధేనువుగా మారాయి. చెరువులోకి వరద ప్రవాహం తగ్గిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు రియల్టర్లు సమీపంలోని పట్టా భూములతో పాటు చెరువు శిఖం భూముల్లోకి చొరబడ్డారు.
గతంలో అధికారులు గుర్తించిన 14.29 ఎకరాల చెరువు స్థలంలో దర్జాగా ప్లాట్లు వేసి, రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా భారీ భవనాలను సైతం లేపారు. ఇక్కడ గజం ధర రూ.లక్షకు పైగా, ఎకరం ధర రూ.50 కోట్లకు మించి పలుకుతుండటంతో.. కబ్జాకు గురైన ఈ మొత్తం భూమి విలువ సుమారు రూ.735 కోట్లు ఉంటుందని స్థానికులు లెక్కగడుతున్నారు.
బడాబాబులను కాపాడేందుకే ‘హైడ్రా’ తొందరపాటు?
ప్రభుత్వ స్థలాలను, చెరువులను కాపాడాల్సిన హైడ్రా తీరుపై పీరం చెరువు గ్రామస్థు లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను కాదని హైడ్రా రాత్రికి రాత్రే కంచె వేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులో అక్రమంగా నిర్మించిన ప్లాట్లు, ఫ్లాట్లను స్థిరస్తి కొనుగోలుదారులకు త్వరగా అమ్ముకునేలా నమ్మకం కల్పించడానికే ఈ ఫెన్సింగ్ వేశారని, ఇందులో ప్రభు త్వానికి కానీ, ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడుతున్నారు. గతంలో గుర్తించిన శిఖం భూములను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోకుండానే హైడ్రా ‘ఫినిషింగ్’ టచ్ ఇవ్వడం వెనుక బడా బాబులను కాపాడే ప్రయత్నమే ఉందనే ఆరోప ణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
సర్వే చేశాకే హద్దులు తేల్చండి..
చెరువు భూముల పరిరక్షణ కోసం స్థానికులు, ’సేవ్ పీరం చెరువు’ బృందం సభ్యులు వారం రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముందుగా రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా విభాగాల సంయుక్త ఆధ్వర్యం లో సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులు నిర్ధారించిన తర్వాతే ఫెన్సింగ్ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం హైడ్రా ఇన్స్పెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు, గతంలో కబ్జాకు గురైనట్లు గుర్తించిన భూములను స్థానికులు చూపించినప్పటికీ వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రి య ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే పూర్తిస్థాయి సర్వే జరిపి అక్రమ నిర్మాణాలను బట్టబయలు చేయాలని, చెరువు భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.