కాలేజీల్లో సినీ షోకం!

03-11-2026 | 05:30am
  1. చిత్రాల ప్రమోషన్లకు కేరాఫ్‌గా పలు కళాశాలలు 
  2. థియేటర్లకు వెళ్లేందుకు అనుగుణంగా సెలవులు కూడా.. 
  3. సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం 
  4. ప్రత్యేక చట్టం రూపకల్పనపై సమాలోచనలు 

* సినిమాల ప్రచారం ఇటీవల ఉన్నతస్థాయి విద్యాసంస్థలకు పాకింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలు సినిమా ఫంక్షన్లకు కేరాఫ్‌గా మారుతున్నాయి. యువతే లక్ష్యంగా సినిమాల బాధ్యులు విద్యాసంస్థలను ప్రచార కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. ఉచితంగా ప్రచారం జరుగుతున్నదనో, లేదా మరేదైనా లాభమో గానీ.. విద్యాసంస్థల నిర్వాహకులు కూడా ఇలా వేడుకల నిర్వహణకు పోటీపడుతున్నట్లు అర్థమవుతోంది. లాభనష్టాలు పక్కనపెడితే.. ఆ వేడుకలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. 

నవంబర్ 2 (విజయక్రాంతి): ఒకప్పుడు విద్యాసంస్థ(Educational institution) అంటే ఆవిష్కరణలకు, పరిశోధనలకు నిలయం. కానీ ఇప్పుడు పరిస్థితి రోజురోజుకు మారిపోతున్నది. చదువు చెప్పాల్సిన కాలేజీలు, యూనివర్సిటీలు(Colleges and universities) సినిమా ప్రమోషన్లకు(Movie promotions) వేదికలుగా మారుతున్నాయి. కాలేజీకి డుమ్మాకొట్టి సినిమాలకు వెళ్తే దండించే గురువే ఇప్పుడు టాకీసులకు వెళ్లేందుకు సెలవులు ప్రకటిస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలతో నేటి ఈ విద్యా విధానం ఎటువైపు పయనిస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సినిమా హీరో, హీరోయిన్లు(Film actors and actresses) తమ సినిమా ప్రమోషన్ కోసం కాలేజీకి వస్తే చాలు, యాజమాన్యాలు వారికి సంపూర్ణ మద్దతిస్తున్నాయి. క్లాసులు బంద్ పెట్టించి విద్యార్థులందరినీ గ్రౌండ్‌లోకి తీసుకొస్తున్నాయి. అధ్యాపకుల తో పాఠాలు చెప్పించాల్సిన యాజమాన్యాలు సినిమా డైలాగులు చెప్పిస్తున్నారు. పరిమితికి మించి వేలాదిమందితో సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తుండటంతో అనుకోని సంఘటనలు జరిగి విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఇటీవల మల్లారెడ్డి యూనివర్సిటీలో ఓ సినిమా ప్రమోషన్‌లో ఎత్తులో పెట్టించిన సౌండ్ బాక్సులు విద్యార్థులపై కుప్పకూలడంతో విద్యార్థులు ప్రమాదబారిన పడ్డారు. అలాగే ఎంవీఎస్‌ఆర్ కాలేజీలో నిర్వహించిన దాండియా ఈవెంట్‌లో లైటింగ్ పోల్ మీద పడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. ఈ అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు పటిష్ట చర్యల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.  

కాలేజీకి ఉచిత ప్రచారం కోసం  పాకులాట!

-విద్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యాక్టివిటీస్ నిర్వహించుకోవడంలో తప్పులేదు. కానీ ఇలా విద్యార్థుల ప్రాణాలు పోయేలా ప్రమోషన్లు నిర్వహించడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తమ సంస్థకు పేరు రావాలనే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాలేజీకి మంచి పేరొస్తే ఫీజులు దండుకోవచ్చనే ఉద్దేశమూ ఉందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. సినిమాలు, షికార్లు మానేసి చదువుపై దృష్టి పెట్టమని చెప్పాల్సిన గురువులే, రేపు మన కాలేజీలో సినిమా ఫంక్షన్ ఉంది, అందరూ హాజరు కావాలంటున్నారు.. పైగా సినిమా చూసేందుకు సెలవు కూడా ఇస్తామంటూ ప్రకటించేస్తున్నారు. 

నష్టం ఎవరికి?

దీనివల్ల నష్టపోయేది విద్యార్థులే. తల్లిదండ్రులు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థికి ల్యాబ్‌లో ప్రయోగం చేయడం రావడం లేదు. పరిశ్రమలకు అవసరమయ్యే స్కిల్ ఉండడంలేదు. కానీ ఇలాంటి ప్రమోషన్ల కారణంగా కానీ ఏ హీరో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇట్టే తెలుసుకుంటున్నారు. పరిశోధనలు చేయాల్సిన విద్యాసంస్థల్లో సైతం పరిశోధన పేపర్ల కంటే, సినిమా ప్రమోషన్ ఫొటోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలో పేటెంట్లు, ఆవిష్కరణల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ భారి ప్రమోషన్ ఈవెంట్లకు కేరాఫ్‌గా మారిందనే విమర్శలున్నాయి. 2023లో జరిగిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్, 2026 ఆగస్టులో జరిగిన ‘టాక్సిక్’ మూవీ ఈవెంట్, లేటెస్ట్‌గా జరిగిన ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ ఇవన్నీ కాంట్రవర్సీలు క్రియేట్ చేశాయి. కొత్తకొత్త ఆవిష్కరణల దిశగా విద్యాలయాలు పనిచేయకపోవడంతో ప్రపంచస్థాయి యూనివర్సిటీల జాబితాలో మన విద్యాసంస్థలు ఎక్కడో వెనుక వరుసలో ఉంటున్నాయి. 

విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చట్టం..

రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహణకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఇటీవల సిఫార్సు చేసింది. ఈ మేరకు ‘తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేషన్ అండ్ సేఫ్టీ’ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఇటీవల నాదర్‌గుల్‌లోని  ఎంవీఎస్‌ఆర్ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌లో ప్రమాదం జరగడం, ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం..

మరికొందరు గాయపడిన ఘటనతోపాటు మల్లారెడ్డి యూనివర్సిటీలో సినిమా ఈవెంట్స్‌పై విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేయడంతో సీరియస్‌గా తీసుకుని ఆ కాలేజీలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలి కాలంలో కాలేజీల్లో అనేక ఈవెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా విద్యా మండలి ప్రత్యేక చొరవ తీసుకున్నది.

సేఫ్టీ బిల్లుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.ఈవెంట్స్‌కు హాజరయ్యే జనం, వేదిక సామర్థ్యం, నిర్వహించే వేడుక ఆధారంగా రిస్క్‌ను అంచనావేయడం, భద్రతా ప్రమాణాలు పాటించడం, సంస్థాగత భద్రతా కమిటీల ఏర్పాటు, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖల మధ్య అంతర్ ఏజెన్సీ సమన్వయం, శిక్షణ, మాక్‌డ్రిల్స్ నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని బిల్లులో సిఫార్సు చేసింది.

ఈవెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సూచించింది. అయితే విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లను పూర్తిగా నిషేధించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా ప్రమాణాలను పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలా ప్రత్యేక చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాయి.  

మరిన్ని వార్తలు