ఆర్థిక ప్రగతి కేంద్రాలుగా జిల్లాలు
గ్లోబల్ సప్లై చైన్‌తో స్థానిక పరిశ్రమల అనుసంధానం
మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లై చైన్‌తో(Global Supply Chain) అనుసంధానించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక ఆర్థిక ప్రగతి కేంద్రంగా (గ్రోత్ ఇంజన్) తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తంగా సోమవారం టీ-హబ్‌లో నిర్వహించిన మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌కు(Mega FTA Outreach Programme) ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనలో ఎగుమతుల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏలు) వల్ల అనేక నూతన వాణిజ్య అవకాశాలు తలుపు తడుతున్నాయని తెలిపారు. వీటిని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు మార్గనిర్దేశనం చేస్తామని స్పష్టం చేశారు. మేడ్ ఇన్ తెలంగాణ ఉత్పత్తులు ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలన్నింటికీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
జిల్లాల వారీగా లభించే ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి, వాటి తయారీ, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. దేశీయ ఆహార అవసరాలు తీరిన తర్వాత మిగిలే వ్యవసాయ ఉత్పత్తులు వృథా కాకుండా ఎగుమతులకు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, కలెక్టర్లు మను చౌదరి, ప్రియాంక ఆలా, కుష్బూ గుప్తా, అనురాగ్ జయంతి పాల్గొన్నారు.