ఏపీలో నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Vote Counting) ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇందులో 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 3,186 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 138 లెక్కింపు కేంద్రాలను (Counting Centres) ఏర్పాటు చేశారు.
మొత్తం 556 హాళ్లు, 6,831 బల్లలను (Counting Tables) సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 47,817 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 2,805 లెక్కింపు బల్లలను ఏర్పాటు చేశారు.
లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు హాళ్లలో నిఘా కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేశారు.