సదాశివపేట బైపాస్ రోడ్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ
* గంటల తరబడి వృథాగా పారుతున్న తాగునీరు
* అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
సదాశివపేట అక్టోబర్ 23: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన మిషన్ భగీరథ పథకం పైపులైన్(Mission Bhagiratha scheme pipeline) నుంచే నీరు వృథాగా పారుతుంటే సంబంధిత అధికారులకు కనిపించడం లేదా? సదాశివపేట బైపాస్ రోడ్డులో(Sadashivapet Bypass Road) ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో భారీగా తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. పైపులైన్ దెబ్బతిని గంటలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు ప్రజలకు తాగునీటి సమస్యలు(Drinking water issues) ఎదురవుతుంటే, మరోవైపు విలువైన తాగునీరు రోడ్లపై వృథాగా పారిపోతుండటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పైపులైన్ల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమా,పైపులైన్ పగిలిన వెంటనే స్పందించి నీటి వృథాను అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై లేదా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి మిషన్ భగీరథ సంబంధిత అధికారులు, సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పైపులైన్ లీకేజీని అరికట్టి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి వృథాను వెంటనే నిలిపివేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.