మంత్రి వివేక్ వెంకట్ స్వామిని కలిసిన ఎస్జిటియు ప్రతినిధులు
ఎస్జిటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి
జీవో నెంబర్ 25 సవరించాలని డిమాండ్
సంగారెడ్డి, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో(Telangana State Secretariat) మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామిని ఎస్ జి టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యాబోధనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 25 వల్ల ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రికి వివరించారు. విద్యార్థుల అభ్యసన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ జీవోలో తగిన సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అరికెల వెంకటేశం మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, విద్యా ప్రమాణాలను పెంచాలని కోరారు. అదేవిధంగా ప్రతి తరగతి గదికి ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతర పెండింగ్ సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యంగా, ఉపాధ్యాయుల హక్కుల కోసం, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఎస్ జి టి యు నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం ద్వారానే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు. ఈ వినతిపై స్పందించిన మంత్రి వివేక్ వెంకట్ స్వామి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.