బడివేళకు బస్సులేవీ..? రోడ్డెక్కిన విద్యార్థులు
నారాయణఖేడ్,(విజయ క్రాంతి): పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు(RTC special buses) నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు(Students) సోమవారం మనూరు మండలం(Manur Mandal) బెల్లాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధలగామ, బెల్లాపూర్, పులుకుర్తి, దోసపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. నారాయణఖేడ్ నుంచి పులుకుర్తి వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. బస్సు సౌకర్యం లేక పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సమాచారం అందుకున్న మనూరు ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులను ఫోన్లో సంప్రదించి సమస్యను వివరించారు. విద్యాసంస్థల సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సు నడిపించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.