కన్నీటి ఉల్లి!
- మార్కెట్‌లో కిలో రూ.70 దాటిన వైనం
- ఆకాశాన్నంటుతున్న ధరలు
- బేజారవుతున్న సామాన్యుడు
- వారాల వ్యవధిలోనే రెట్టింపైన ధర
- దిగుమతులు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు
- ప్రభుత్వ జోక్యం కోరుతున్న ప్రజలు
(ఎ.చంద్రశేఖర్ రావు) :
సంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మధ్యతరగతి, పేద కుటుంబాల వంటగది(Kitchen)లో ఉల్లిపాయ(Onion) మళ్లీ కన్నీరు పెట్టిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరల(Prices of essential commodities) పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడిపై ఉల్లి భారం మరింతగా పడింది. గత కొన్ని వారాలుగా మార్కెట్‌లో ఉల్లి ధరలు(Onion prices) నిరంతరాయంగా పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి.
క్రితం వారం వరకు కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య పలికిన ఉల్లి ధర, ప్రస్తుతం బహిరంగ మార్కెట్(Open market)లో రకాన్ని బట్టి రూ.70 నుంచి రూ.90 మార్కును తాకింది. కొన్ని ప్రాంతాల్లో నాణ్యమైన ఉల్లి ధర సెంచరీకి చేరువలో ఉండటం గమనార్హం. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2024 లో 307.67 లక్షల టన్నులు, 2025 307.37 లక్షల టన్నుల ఉల్లి వార్షిక ఉత్పత్తి(Annual onion production) దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల మార్కెట్‌కు వచ్చే లోడ్లు ఆలస్యం కావడంతో 2026 ద్వితీయార్థంలో ధరలు ఏకంగా 82 శాతంపైగా పెరిగాయి.
దిగుబడులు తగ్గడమే కారణం
ప్రధానంగా ఉల్లి పండించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పులు(Climate change), అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతినడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని హోల్‌సేల్ వ్యాపారులు చెపుతున్నారు. మార్కెట్‌కు రావాల్సిన లోడ్లు సగానికి పైగా తగ్గిపోవడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొత్త పంట మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని, అంతవరకు ధరలు ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
ఘాటు ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడి వంట గదిపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వారానికి రెండు, మూడు కిలోలు కొనుగోలు చేసే వినియోగదారులు, ఇప్పుడు అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కూడా ఉల్లిపాయల వాడకాన్ని భారీగా తగ్గించేశారు. బిర్యానీలు, కూరల్లో ఉల్లిపాయల మోతాదును తగ్గించడమే కాకుండా, సలాడ్లలో ఉల్లిపాయలను ఇవ్వడం పూర్తిగా ఆపే పరిస్థితి దాపురించిందని వినియోగదారులు వాపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి ఉత్పత్తి గణాంకాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి వినియోగానికి సరిపడా స్థానిక ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలపై ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకపై ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 5.95 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు అవుతుండగా, వార్షిక ఉత్పత్తి దాదాపు 1.24 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదవుతోంది.
అయితే రాష్ట్ర అవసరాలకు ఇది చాలా తక్కువ. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో పరిశీలిస్తే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు విస్తృతంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 44.6 వేల హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతూ, ఏటా సగటున 5.13 లక్షల నుంచి 7.22 లక్షల టన్నుల మధ్య దిగుబడి లభిస్తోంది. తెలంగాణలో ఉల్లిసాగుతో పాటు ఉత్పత్తి కూడా ఏపీతో పోల్చుకుంటే చాలా తక్కువని స్పష్టమవుతోంది.
ప్రభుత్వ జోక్యానికి డిమాండ్
ఉల్లి ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. రైతు బజార్లు, ప్రభుత్వ రాయితీ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ఉల్లిని సరఫరా చేసి నల్లబజారును అరికట్టాలని వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గత మూడేళ్లలో హెచ్చుతగ్గులు
గత మూడేళ్లుగా దేశీయంగా రాష్ట్ర మార్కెట్‌లో ఉల్లి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎగుమతి, -దిగుమతి విధానాలు, నిల్వ నష్టాల కారణంగా ఏటా పండుగ సీజన్ (ఆగస్టు - నవంబర్) సమయానికి ఉల్లి ధరలు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఎగుమతులపై ఆంక్షలు, ఖరీఫ్ పంట దెబ్బతినడం వల్ల 2024లో సాధారణ పంట కాలంలో ధర కిలో రూ.20-30 ఉంటే సీజన్ సమయంలో గరిష్ట ధర కిలో రూ.60-80 పలికింది.
2025లో రూ.20-25 సాధారణ పంట కాలంలో ధరలు ఉంటే కొరత సమయంలో రూ.55-65 ధర పలికింది. ఇందుకు రబీ సీజన్ దిగుబడులు మెరుగ్గా ఉన్నప్పటికీ, నిల్వ ఉంచిన ఉల్లి నాణ్యత దెబ్బతినడంతోనే జరిగిందని నిపుణులు చెబుతున్నారు. 2026లో సాధారణ పంట కాలంలో రూ.25-35 ధర పలికితే ప్రస్తుతం రూ.70-90 వరకు ధర పలకడం వెనుక ఎల్ నినో ప్రభావం, ఆలస్యమైన రుతుపవనాలు, నాసిక్, కర్నూలు నుంచి సరఫరా సగానికి తగ్గడం ప్రధాన కారణాలుగా చెపుతున్నారు.