ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం
మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన ఆటో ట్రాలీ
జిహెచ్ఎంసి కార్మికుడు, ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
రామచంద్రపురం, అక్టోబర్ 25: ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్ ను అతి వేగంగా వచ్చిన మినీ ట్రాలీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్(Kolluru Police Station) పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద డివైడర్ల మొక్కలకు జిహెచ్ఎంసికి చెందిన వాటర్ ట్యాంకర్ సిబ్బంది నీరు పోస్తున్నారు.
అదే సమయంలో హైదరాబాదు నుండి ముత్తంగి వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ ఆటో ట్రాలీ వేగంగా వచ్చి కార్మికుడు శ్రీనివాస్ (30)తో పాటు వాటర్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. దీంతో కార్మికుడితో పాటు ట్రాలీ నడుపుతున్న డ్రైవర్ శ్రీనాథ్ (26) క్యాబిన్లో ఇరుక్కుని తీవ్ర గాయాలతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాలను పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.