గజ్వేల్‌లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వైద్య శిబిరం

24-10-2026 | 06:30pm

ముందస్తు పరీక్షలు.. 500 మందికి పైగా లబ్ధి

గజ్వేల్, అక్టోబర్ 24 : బ్రెస్ట్ క్యాన్సర్(Breast Cancer) అవగాహన మాసాన్ని పురస్కరించుకుని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(Star Health Insurance) ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం(Pragnapur Municipal Office)లో శనివారం ఉచిత బహుళ వైద్య ప్రత్యేకతల ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు, నిపుణుల సంప్రదింపులు, ఆరోగ్య అవగాహన సేవలు పొందారు. రెనోవా గ్రూప్, మా ఈఎన్‌టీ, ఆదితి, గజ్వేల్ ఐ, డాక్టర్ చరణ్స్ డెంటల్ హాస్పిటళ్ల సహకారంతో కార్యక్రమం నిర్వహించారు.

మహిళలకు పాప్ స్మియర్, మామోగ్రఫీ పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించారు. గుండె, ఎముకలు, కీళ్లు, కంటి, దంత, ఈఎన్‌టీ, గైనకాలజీ వైద్య సేవలు అందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జి. చందన రవీందర్, కమిషనర్ పి. గణేష్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ కె. పద్మాభాయ్ నర్సింగరావు పాల్గొన్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలంగాణ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ కేబీబీ మాట్లాడుతూ ముందస్తు పరీక్షలతో వ్యాధులను తొలిదశలో గుర్తించవచ్చన్నారు.

ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు(Medical examinations) చేయించుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు