ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లు కల్పించాలి
- సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ డిమాండ్
- 24న తెలంగాణలో ప్రవేశించనున్న రథయాత్ర
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 16: అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు కల్పించాలని రెడ్డి జేఏసీ సిద్దిపేట జిల్లా నాయకులు(Reddy JAC Siddipet District Leaders) డిమాండ్ చేశారు. ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 24, 25, 26 తేదీల్లో తెలంగాణలో నిర్వహించనున్న రథయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో(Siddipet Press Club) సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రథయాత్ర పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్టోబర్ 2న ప్రవీణ్ ఆరోర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల కిలోమీటర్ల మేర చేపట్టిన రథయాత్ర ఢిల్లీలోని బాబూజీ ఘాట్ నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ యాత్ర అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో వేలాది మంది పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ గౌరవాధ్యక్షుడు మారెడ్డి రాంలింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున రెడ్డి, ప్రధాన కార్యదర్శి పన్యాల విష్ణువర్ధన్ రెడ్డి, రెడ్డి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు దొంగల బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.