రాజకీయ రణరంగం.. ఫ్లెక్సీ దహనయత్నంతో ఉద్రిక్తత

08-10-2026 | 10:45am

సిద్దిపేట క్రైం (విజయక్రాంతి): జిల్లా కేంద్రం సిద్దిపేటలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) నాయకుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకులు సేవా సంకల్ప యాత్ర(Seva Sankalpa Yatra) పేరుతో స్థానిక కొండా భూదేవి గార్డెన్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ముందుకు సాగుతున్న క్రమంలో.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ప్రధాని మోదీ ఫ్లెక్సీని దహనం చేసేందుకు మహిళా నేతలు యత్నించగా, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పర దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నేతలు శాంతించకపోవడంతో గాంధీ చౌక్ నుంచి దగ్గరలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు.

బీజేపీ నాయకుల దాడిలో గాయపడిన మహిళలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత మహిళా కార్యకర్తలను ఆమె పరామర్శించారు. తమపై జరిగిన దాడిని కార్యకర్తలు అధ్యక్షురాలికి వివరించారు.‘బేటీ పడావో, బేటీ బచావో’ అంటే మహిళలపై దాడులు చేయడమేనా అని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు రాచకొండ ప్రశాంత్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మహిళలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన బీజేపీ నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ శ్రేణులతో ఏసీపీ రవీందర్‌రెడ్డి మాట్లాడారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు