రాహుల్‌ను బారికేడ్లు ఆపలేవు
- ఓటు చోరీ(Vote Theft)పై ఈసీ జవాబివ్వాలి
- ఎన్నికల పారదర్శకతపై దేశవ్యాప్తంగా సందేహాలు
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : భారత్‌లో ఓటు విలువను కాపాడాలంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న పోరాటాన్ని పోలీసు బారికేడ్లు ఆపలేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నంత మాత్రాన వారు లేవనెత్తిన ప్రశ్నలు సమసిపోవని అన్నారు. ‘సమాధానం కోసం నిలబడిన గొంతును అడ్డుకుంటే, ఆ ప్రశ్న మరింత బలంగా దేశమంతటా ప్రతిధ్వనిస్తుంది’ అని బుధవారం ఉత్తమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం దృఢంగా నిలబడిన రాహుల్‌గాంధీకి ఆయన అభినందనలు తెలిపారు.
ఢిల్లీలో ఎన్నికల సంఘం(Election Commission) వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలకు అనుగుణంగా పూర్తి నిష్పాక్షికతతో వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలంటే నిర్ణయాల్లో పారదర్శకత, అభ్యంతరాల పరిశీలనలో నిజాయితీ, సమాధానాల్లో స్పష్టత ఉండాలని సూచించారు.
ఓటర్ల జాబితాల(Voter List)పై వచ్చిన అభ్యంతరాలను రాజకీయ విమర్శలంటూ కొట్టిపారేయడం సరికాదని విమర్శించారు. ఓటు చోరీ(Vote Theft) ఆరోపణలను దేశవ్యాప్త చర్చలోకి తీసుకురావడంలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి పాలకులు తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో పేదలు, చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని రాహుల్‌గాంధీ నిలదీశారని గుర్తుచేశారు.
2020 మార్చిలో కోవిడ్ కారణంగా పొంచి ఉన్న తీవ్రమైన ఆర్థిక దెబ్బపై హెచ్చరించారని, లడఖ్ సరిహద్దు పరిణామాలపై దేశానికి స్పష్టత ఇవ్వాలని పదేపదే కోరారని ప్రస్తావించారు. ప్రజల ఆందోళనలను అధికార వ్యవస్థల ముందుంచడంలో రాహుల్‌గాంధీ చూపిన పట్టుదల ఇప్పుడు ఎన్నికల పారదర్శకత పోరాటంలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘ఒక నాయకుడిని అదుపులోకి తీసుకోవచ్చు. కోట్లాది ప్రజలకు సంబంధించిన ఓటు హక్కు ప్రశ్నను మాత్రం నిర్బంధించలేరు.
ఆ ప్రశ్నకు జవాబు దొరికే వరకు ప్రజాస్వామ్య చర్చ కొనసాగుతుంది..’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం విశ్వసనీయమైన, బహిరంగ ప్రక్రియ ద్వారా సమాధానాలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రతి ఓటును కాపాడటం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని సూచించారు ఎన్నికల పారదర్శకత కోసం రాహుల్ గాంధీ పోరాటానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల ఓటు విలువను కాపాడే బాధ్యత విషయంలో వెనకడుగు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.