ఓంకారేశ్వరుడికి వెయ్యికోట్లు!
- మంచిరేవులలో ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు
- ఆలయ అభివృద్ధికి రూ.948.65 కోట్లు
- ఆరు లేన్ల రోడ్డుకు రూ.159.62 కోట్లు
- భారీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మూసీ పరివాహకం
- ఆలయ నిర్మాణ పనులకు నిపుణుల పర్యవేక్షణ
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో(Musi River Rejuvenation Project) భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం(Gandipet Mandal) మంచిరేవులలో శ్రీఓంకారేశ్వర స్వామి ఆలయ(Sri Omkareshwara Swamy Temple) సముదాయాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మొత్తం రూ.1,108.27 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ఆలయ సముదాయం అభివృద్ధికి రూ.948.65 కోట్లు, ఆలయానికి అనుసంధానంగా 30 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు కేటాయించింది.
ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని కేవలం నదీ పునరుజ్జీవనానికి పరిమితం చేయకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటకంతో అనుసంధానించే ఉద్దేశంతో ఈ ఆలయ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మంచిరేవులలో ప్రధాన ఆలయంతో పాటు పలు ఉప ఆలయాలు, భారీ మండపాలు, రాజగోపురాలు, పుష్కరిణి, యాగశాల, శివుడి ప్రతిమ తదితర నిర్మాణాలను చేపట్టనున్నారు.
శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయం అభివృద్ధికి మొత్తం రూ.948.65 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో ఆలయ నిర్మాణ, ఆర్కిటెక్చరల్ పనులకు రూ.598.98 కోట్లు, సివిల్, స్ట్రక్చరల్, ఎంఈపీ, ఇతర అనుబంధ సౌకర్యాల కోసం రూ.349.67 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉప క్షేత్రాలు, పార్కింగ్, భక్తుల సౌకర్యాలు, ఇతర అనుబంధ వసతులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ) చార్జీలు కూడా ఇందులో ఉన్నాయి.
ప్రధాన ఆలయంతో పాటు శ్రీ వీరభద్ర, భద్రకాళి ఆలయం, శ్రీ లలితా మహా త్రిపురసుందరి దేవి ఆలయం, శ్రీ బాల గణపతి స్వామి ఆలయం, శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించనున్నారు. వీటితో పాటు మహా మండపం, నంది మండపం, ప్రాకారాలు, రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణి, ఐకానిక్ శివ విగ్రహం, భక్తుల కోసం ఇతర మతపరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఆలయ సముదాయానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు మరో రూ.159.62 కోట్లతో ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు.
ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్ విండ్ విల్లాస్ వరకు 30 మీటర్ల (100 అడుగుల) వెడల్పుతో సుమారు 2.50 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మించనున్నారు. ఈ రోడ్డు శ్రీఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయాన్ని, సమీపంలోని గ్రేహౌండ్స్ భూములు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను, మూసీ రివర్ ఫ్రంట్ రోడ్డు నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయనుంది. రహదారిలో పేవ్‌మెంట్, డ్రైనేజీ, అవసరమైన చోట్ల రిటైనింగ్, ప్రొటెక్షన్ వర్క్స్, కల్వర్టులు, లైటింగ్, రోడ్డు భద్రతా చర్యలు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.
ప్రత్యేక సాంకేతిక కమిటీ..
ఆలయ నిర్మాణంలో ప్రత్యేక శిల్పకళ, రాతి చెక్కడం, దేవాలయ వాస్తు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభు త్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ సముదాయం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగులు, డీపీఆర్లు, అంచనాలను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కో-చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కన్వీనర్‌గా, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్, ఆలయ నిర్మాణ నిపుణుడు డాక్టర్ ఈ శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రత్యేక ఆలయ నిర్మాణ పనులకు సాంకేతిక మార్గదర్శకాలు, డిజైన్లు, డీపీఆర్‌లు, అంచనాలకు ఆమోదం, ప్రత్యేక నాన్- ఎస్సెస్సార్ పనులకు రేట్ల ఖరారు, టెండరింగ్, పనుల అమలు, అవసరమైన మార్పు లు, అదనపు పనుల పరిశీలన వంటి బాధ్యతలు నిర్వహించనుంది. ముసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా మంచిరేవులలో చేపడుతున్న ఈ భారీ ఆలయ సముదాయం పూర్తయితే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.