నివాసాల మధ్య నిలిచిన మురుగు నీరు
చేర్యాల, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): చేర్యాల పట్టణంలోని(Cheryala Town) 6వ వార్డులో మురుగు నీరు, వర్షపు నీరు(Sewage and rainwater) నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలనీలో సీసీ రోడ్డు నిర్మించగా, నీటి పారుదల కోసం గతంలో ఏర్పాటు చేసుకున్న పైపులు తొలగిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో వ్యవసాయ పొలాల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు, డ్రైనేజీ నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఇళ్ల మధ్యే నిలిచిపోతున్నాయి.
నీటితో పాటు చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని, పాములు, తేళ్లు,విషపురుగుల సంచారం పెరిగే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు నిర్మాణ సమయంలో నీటి పారుదల వ్యవస్థపై సరైన దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకులు స్పందించి నీటి పారుదల కోసం పైపులైన్ ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.