అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
బెజ్జంకి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి(CPI District Executive Member Pothireddy Venkata Reddy), మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల(Telangana Farmers Armed Struggle Week celebrations) ముగింపు సందర్భంగా గురువారం బెజ్జంకి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి, భుక్తి, శ్రమజీవుల విముక్తి కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగేమ్ మధు, బోనగిరి శ్రవణ్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్, అంతటి రాకేష్, నాయకులు పండుగ పరుశరాములు, సంఘ తిరుపతి, దుగ్యాని తిరుపతి, బండి సమ్మయ్య, కనగండ్ల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.