పాపన్నపేటలో ఘనంగా తెలంగాణ వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు
పాపన్నపేట,అక్టోబర్22: తెలంగాణ గడ్డపై నిజాం రజాకార్ల(Nizam's Razakars) దౌర్జన్యాలను ఎదిరించి, పేద ప్రజల పక్షాన నిలిచిన తెలంగాణ రాబిన్ హుడ్, స్వాతంత్ర్య సమరయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మండల అధ్యక్షుడు కిష్టయ్య అధ్యక్షత వహించారు.
ముందుగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... దొరల గడీలపై దాడి చేసి, పేదల సొమ్మును పేదలకే పంచిన మహోన్నత వ్యక్తి పండుగ సాయన్న అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ముదిరాజ్ జాతి అభివృద్ధికి, ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ముశెట్టి కిష్టయ్య, ఉపాధ్యక్షుడు బుడిమె సత్యనారాయణ, యువజన మండల అధ్యక్షుడు కిరణ్, నాయకులు టేక్మాల్ సాయిలు, బొక్కల బాగయ్య, ఏసు వెంకటేశం, ఆంజనేయులు, విఠల్, మల్లేశం, లక్ష్మణ్, యువకులు పాల్గొన్నారు.