వరుస చోరీలు.. జనం బెంబేలు!

24-10-2026 | 05:05am
  • తాళం వేసి ఉన్న ఇండ్లు, షాపులు టార్గెట్
  • దేవాలయాల్లోనూ అదే తీరు..
  • పలు చోట్ల బైకులు, మూగజీవాలను వదలని దొంగలు
  • పనిచేయని సీసీ కెమెరాలతో రాత్రి వేళల్లో కొరవడుతున్న నిఘా
  • పోలీసులకు పెను సవాల్‌గా మారుతున్న చోరీ కేసులు

హుజూర్‌నగర్, అక్టోబర్ 23: కొద్ది రోజులుగా నియోజకవర్గం(Huzurnagar constituency)లో చోరీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలు తమ పనికానిస్తున్నారు. వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా ఆ కేసులు చెందించడం పోలీసులకు పెను సవాల్ గా మారాయి. పట్టణంలోని సుందరయ్య నగర్ లో ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధురాలని హత్య చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇటీవల కోదాడ నుంచి హుజూర్ నగర్ కు బస్సులో వస్తున్న పట్టణానికి చెందిన ఓ మహిళ తన బ్యాగులో బంగారు నగలు సుమారు రూ.15 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లారు.

ఇక  సాయిబాబా థియేటర్ రోడ్డులో ఉన్న ఓ వ్యాపారి బంధువుల పెళ్లి వేడుకలకు వెళ్ళగా అదే అదునుగా చూసి ఇంటి వెనుక వైపు తలుపు పగలగొట్టి బీరువాలో దాచిన సుమారు రూ.25 లక్షల విలువచేసే బంగారు,వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. గత సంవత్సరం అక్టోబర్ లో పట్టణంలో అనసూయమ్మ అనే వృద్ధురాలు వద్ద కొంత నగదును అప్పుగా తీసుకుని ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని అదును చూసి చంపి నగలు ఎత్తుకెళ్లారు.

ఈ నేరంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయా యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చోరీలు జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని,చోరీ ముఠాలను వెంటనే పట్టుకుని వరుస దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

 త్వరలో పట్టుకుంటాం..

నేరానికి పాల్పడిన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడుతుంది. సాంకేతికత ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. చోరీ చేసిన వస్తువులను రికవరీ చేస్తున్నాం.పెట్రోలింగ్ వాహనాలతో 24 గంటలు గస్తీ కాస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదు. కొన్ని చోట్ల కోతుల బెడద కారణంగా సీసీ కెమెరాలు తరుచూ పనిచేయడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. చోరీ ఘటనల్లో ఆధారాలు సేకరించాం. పాత రికార్డులతో సరి చూస్తున్నాం త్వరలోనే దొంగలను పట్టుకుంటాం.          

 జి.చరమంద రాజు, సీఐ హుజూర్‌నగర్

మరిన్ని వార్తలు