బాలల స్నేహపూర్వక జిల్లాగా సూర్యాపేట
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District)ను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandlal Pawar) అన్నారు. పిల్లల హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛ, అభిరుచులు, ఆలోచనా విధానంపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులు, విద్యాశాఖ క్లస్టర్, గ్రామస్థాయి రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ప్రతి అధికారి పిల్లల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాలలు తమ హక్కులను, స్వేచ్ఛను పూర్తిస్థాయిలో అనుభవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పిల్లల్లోని నైపుణ్యాలు, అభిరుచులను గుర్తించి, వారు స్వచ్ఛందంగా తమ ప్రతిభను ప్రదర్శించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
ఈ శిక్షణ సూర్యాపేటను ఆదర్శ బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి ఫిలిప్స్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా రెవెన్యూ అధికారి రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, ట్రైని డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనుష జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. రవికుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉపేంద్ర, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.