ఎలినినోపై రైతులకు అవగాహన
మండల వ్యవసాయ అధికారి ప్రణీత
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండలంలోని మల్కాపూర్, అనంతపల్లి గ్రామాల్లో ఎల్నినో ప్రభావాలు(El Niño Impacts), వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ రంగంపై కలిగే ప్రభావాలు, రైతులు(Farmers) తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన సమావేశాలు మండల వ్యవసాయ అధికారి ప్రణీత నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
రైతులు పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నేలలో తేమను కాపాడుకునే పద్ధతులను అవలంబించాలని, అవసరానికి అనుగుణంగా ఎరువులు, పురుగుమందులను వినియోగించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని కోరారు. మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మండల వ్యవసాయ అధికారి ప్రణీత, గ్రామ సర్పంచ్ తులసి, ఏపీఓ సబిత, వ్యవసాయ విస్తరణ అధికారి చెల్పురి లక్ష్మణ్, గ్రామ కార్యదర్శి శ్రీహిత తదితరులు పాల్గొన్నారు.
అనంతపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో గ్రామ సర్పంచ్ గంగాధర్ కావ్య, గ్రామ కార్యదర్శి అనిల్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పంటల యాజమాన్య పద్ధతులు, నీటి వినియోగంలో పాటించాల్సిన మెళకువలపై చర్చించారు. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంట నష్టాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.