జనగణన–2027 పక్కా సమాచారంతోనే ప్రగతి సాధ్యాం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
రెండవ దశ జనాభా గణనపై అధికారులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం
వరంగల్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఖచ్చితమైన జనాభా గణాంకాలే దేశ సమర్థవంతమైన అభివృద్ధికి, భవిష్యత్తు సంక్షేమ పథకాల రూపకల్పనకు బలమైన పునాది అని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(District Collector Dr Satya Sharada) పేర్కొన్నారు. ‘జనగణన–2027’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న రెండవ దశ జనాభా గణనపై జిల్లా, సబ్-డిస్ట్రిక్ట్, ఛార్జ్ స్థాయి అధికారులకు మంగళవారం రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార సేకరణలో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సేకరించే ప్రతి వివరమూ నిష్పక్షపాతంగా ఉండేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. హైదరాబాద్ జిల్లా సెన్సస్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన శిక్షణ అధికారి సతీష్ అధికారులకు జనగణన విధివిధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.
జనాభా గణన ప్రక్రియ, సమాచార నమోదు విధానం, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు-పరిష్కార మార్గాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. అధికారులు ముందస్తుగా పూర్తి అవగాహన పెంపొందించుకుని, జనగణనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వై.వి. గణేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ముఖ్య ప్రణాళికాధికారి పి. చంద్రకళ, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎస్వో సుభాష్ తదితరులు పాల్గొన్నారు.