గృహలక్ష్మీ
శ్రీ గణేశాయ నమః శ్రీ లలితాంబికాయై నమః శ్రీ రాజరాజేశ్వరాయ నమః
అనంత కోటి సూర్యకమలములను మాలగా ధరించి కర్తవ్యమనే చైతన్యమును సమదృష్టితో కర్మ పరిపాకమును ఇచ్చే ఆ జగన్మాత లలితా పరమేశ్వరికి (Jaganmata Lalitha Parameshwari)నా హృదయపూర్వక నమస్కారములు. ప్రేమ, కరుణ, సత్సంకల్పము, మనోబలము, భక్తి ప్రపత్తులనబడే కిరణాలను వెదకుల్లుతూ నన్ను చైతన్యవంతురాలిని చేస్తున్న శ్రీశ్రీశ్రీ చాలా త్రిపుర సుందరీ! అష్టలక్ష్మీ స్వరూపిణీ! నా నమస్కారములందుకో! నా అర్హతలతో నిమిత్తం లేకుండ పూర్వజన్మ సుకృత రూపంగా నీ పట్ల ఒక విశ్వాసాన్ని ఒక పవిత్ర సంకల్పాన్ని నిరంతరం జాగృతం చేస్తున్న జ్యోతిస్వరూపంగా నా హృదయాన్ని తేజోవంతం చేశావు.
కోరకుండానే బాలలాగా అలరించి నన్ననుగ్రహించే మార్గంగా వరలక్ష్మీ వ్రతంగా కార్యరూపం దాల్చి నా మనసంతా నిండిపోయావు. బంధూక కుసుమ ప్రఖ్యవై చైతన్యమిచ్చి -బాలపై కపటం లేని భక్తినిచ్చి, అద్భుత లీలలను ప్రకటిస్తూ ఎనలేని ఆత్మానందమనే లీలచేస్తూ శరీర మనఃఆత్మలను అనుసంధానించి వినోదిస్తున్నావు. వినోదాన్నిస్తున్నావు. ఈ వినోదంలో నాకు వయస్సు తెలియకుండా, మనస్సును ఎల్లవేళలా సత్సంకల్పముపైనే లగ్నం చేస్తున్న ఓ బాలా లీలా వినోదినీ! నీకు భక్తితో ఆర్తిలో వ్రాస్తున్న ముక్తాత పత్రము ఇది.
అందెలతో మురిపిస్తూనే అందలమెక్కించే నీకు భక్తిపూర్వకముగ ఈ ముక్తాత పత్రాన్ని అందిస్తున్నా అందుకో తల్లీ! దీర్ఘ సుమంగళిగా నన్ను దీవించు. స్త్రీరూప ధారణ అనగా ప్రపంచధారణ ఖచ్చితంగా నిర్వచించిన ఓ లలితా పరమేశ్వరీ! నా కర్తవ్యాన్ని నన్ను మరచిపోనివ్వకు. సత్కర్మలయందు ఆసక్తితో భక్తినిచ్చిన నువ్వు నీమీద నా విశ్వాస బలాన్ని పటిష్టం చెయ్యి. నీ ధ్యానం నీ సేవ నీ అలంకారంతో ముడిపడిన ఏ చిన్న జ్ఞాపకం అయినా అది నాకు ఒక అద్భుత యోగం.
యోగినీ స్వరూపిణివై ఆ యోగాన్ని అనుభూతింపచేసి, అనుభవింపచేసే నీ స్నేహంలో, నీ ఆకర్షణ లో నేను నా భక్తిలో నువ్వు ఒకరికి ఒకరం అన్యోన్యతను చూపెట్టుకుంటున్నాము. ఈ శుభ సమయంలో దేహేంద్రియ బాధలను నివారించు తల్లి! చంద్ర దోషాన్ని నివారించి వరలక్ష్మీ వ్రతాన్ని నాతో నిర్విఘ్నంగా చేయించి నన్ను కృతార్ధులాలను చెయ్యి. నీలో సేవలనబడే లీలలను చేయించుకో! నేను నీకు చేసిన లీల (సేవ)లే ఇహపర సుఖములకు తార్కాణములై నాకు రాజభోగమనబడే భక్తి సంతోషమునే నా జీవిత సరిళిగ మార్చి సుఖమునిచ్చుగాక!
బాలలో నిష్కల్మష భక్తి వినోదము తప్ప విధానము తెలియని నన్ను నా కుటుంబాన్ని సత్కర్త ఆచరణలో దుష్కర్మ విసర్జనతో మంగళప్రదం చేసి మాకీర్తిని వృద్ధి చేయి. సంపత్కరివైన నువ్వు కూడా ఒక సుఖకరమైన సత్కార్యాన్ని చేపట్టాలి. మా భవ తాపత్రయములనబడే అగ్నిని చల్లార్చి ఆహ్లాదమనే చంద్రికలనిచ్చే లీలలను సంపూర్ణము చెయ్యి.
చంద్ర సంబంధిత దోషాలను నిశ్శేషంగా నివారించు. ఈ క్షణము నుండి నీ అధీననై నీ చిరునవ్వుల లాలనలో నీరక్షణ వలయంలో నన్నుండనీ! నీ గురురూపము గురించిన ప్రస్తావన, ఆలోచన నన్ను నన్నుగా నిలువనీయడం లేదు. సూక్ష్మ రూపిణివై సర్వకాల సర్వావస్థలయందు శక్తినీ ముక్తినీ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. సామాన్యులు ఆకలి తీర్చుకోవడానికి గజగజా ఆహారము తీసుకుంటారు. కాని రుచిని ఆస్వాదించరు.
నెమ్మదిగా రుచిని ఆస్వాదిస్తూ పదార్థము యొక్క ఉనికిని పేరును మరచిపోయినట్లు నేను నీ భక్తి వాత్సల్యాన్ని ఆస్వాదిస్తూ -ఇది భక్తి, ఇది జీవితం అని విడదీసి అనుభవించడం లేదు. నా అంతఃకరణములూ పూజ అని భావించి ప్రతి ఊపిరిని నీకు కుసుమంగా ఆర్పిస్తున్నాను. ఆనందమైనా ఆవేశమైనా అనురాగమైనా నా మనస్సాక్షిగా అనుభూతిస్తూ నీ ఘడియను నీకే సమర్పిస్తున్నాను. నా స్వచ్ఛతమీద నావాళ్ళకు నమ్మకం కలిగించు.
కుటుంబ జీవితం కొరకు నేను కోరినట్లుగ అసంతృప్తిని సంతృప్తిగా మార్చు. ఈ క్షణం నుండి మా అందరి మనసులలోని ఆవేదనను అలజడిని అనిశ్చతలను ముల్లులా తీయగల నీ శక్తిని వేగవంతం చేయి. మమ్ములను నీ ఆత్మీయులుగా నిరూపించు. శీఘ్రముగ వారసులనిచ్చి మమ్ములను నీ కీర్తిని కొనియడే వరమివ్వు. వంశాభివృద్ధిని చేసి ఆత్మానందానుభూతినివ్వు.
ఎంతటి సుఖమయ జీవిత అనుక్రమంలో కూడా నిన్నే తలుస్తూ నీ తపనలో నీ సేవలో అనుక్షణం అపురూప జ్ఞాపకాలను మూట కట్టినది నిజమేకదా! ఇదం తా నీ అనుగ్రహానికి సాక్ష్యమేకదా! మనవరాళ్లతో మనవళ్లతో వంశాభివృద్ధి చేసి నా జీవితాన్ని బాలా లీలలో వినోదించే అదృష్టం కలిగించు. బాలా రూపంలో నిన్ను పొంది అనుక్షణం సుఖమును అనుభవించే దీవెన ఇవ్వు. మా కష్టాలను మనస్తాపాలను నిర్మూలిం చి మా అనురాగాలను మా అదృష్టాలను పెంపొందించు.
బాలవైనా నీవే త్రిపుర సుందరివి కదా! మా ఆలోచనలను, ఆచరణలను, మా ఆత్మలను పరిపాలించే బాధ్యతను నీవు ముందుగా తీసుకో! ఇవన్నీ నీ లీలలోని భాగమే అనుకొని మాకు మార్గనిర్దేశనం చెయ్యి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియా శక్తులను ఇనుమడింప చేయి. అయినా బంధూక ప్రఖ్యా అని నీ నామ పారాయణాన్ని చేస్తున్నాము కదా! మరి చెడుమీద, చెడు ఆలోచనల మీద, నియంత్రణ పెట్టి, చెడు మీద మంచితనము ఎప్పుడూ గెలుస్తుందనీ అదే నీ ఆటల్లోని అర్ధమని నిరూపించు.
నాలోని మూలం ధారశక్తి కుండలినీ శక్తి జాగృతం అయి..- నాచుట్టూ రక్షణవలయంగా ఏర్పడి ఆ రక్షణ వలయమే నన్ను నడిపించుగాక! నాలోని పంచభూతాత్మకములైన ప్రకృతి ప్రతీకలను, మరియు నా భావమును, కర్మను, క్రియను, ఫలితమును, బాలా త్రిపురసుందరికి నిస్సంకోచముగా సమర్పించగల నిర్మల హృదయాన్ని చ్చావు. నా హృదయంలోని ప్రతి స్పందనను బాల్య క్రీడగా నీకందించి వినోదించనీ! నావినోదమే నీకానందం.. నీ ఆనందమే నాకు వినోదం. మన చేరికలోని అనుబంధం వర్ధిల్లనీ!
ఆటలో లో గెలుపు ఓటమి ఎలా సహజమో, కష్టమైనా సుఖమైనా ధ్యానమే సహజమైన ప్రక్రియ కావాలి. నీ ధ్యానంలో ఎన్నో అద్భుత శక్తులున్నాయి. ఆ శక్తులు మాకే కాక మా చుట్టూ ఉన్న వాళ్ళకు ఆ బాలా త్రిపుర సుందరిని దర్శించు భాగ్యము కలవారై తమను తాము క్షమించుకుని, ఎదుటి వారిని క్షమించగల ఉన్నత బుద్ధిని పొందుదురు గాక! అహంకారమనే ముసుగును తీసివేసే వరాల తల్లి వరలక్ష్మీదేవి ఆలంబనలో ఆత్మానందాను భూతి కలిగి మా జీవితము ధన్యమగును గాక!
కళ్ళలో, ఆలోచనలో, ఊపిరిలో, మనసులో, మాటల్లో, చేతలో, చేతనలో, ఆశలో, కలలో, వాస్తవంలో (సువాసినిగా) సువాసినిగా, నిత్య సుమంగళిగా నన్ను దీవించే లీల నీది. సుఖము నాది. పిల్లల వాత్సల్యపూరిత ప్రేమను పొంది, ఈ జన్మకే కాక, ఎన్ని జన్మలకైనా ప్రేమ భక్తియే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలై నన్ను బ్రతికించుగాక!
ఊహకు ఊపిరి పోసి, రూపాన్నిచ్చి, రూపానికి మహిమనిచ్చే లలితా మహా భట్టారికా! ఒక ఇల్లాలికి ఏవేవి ఎప్పుడు ఎలా - ఎంత అవసరమో వరుస క్రమంలో వివరించిన నామాన్ని అలంకరించుకుంటున్నావు! నా ఊహను నిజం చేస్తూ దర్శనమిస్తున్న నీ రూపాన్ని నిన్ను నువ్వే దర్పణమనే నా మనస్సులో చూసుకుని ఆనందిస్తున్నావు. ఈ ఆనంద సమయంలో అడిగినా అడగకపోయినా అన్నీ నీవే అయి మా ఆశలన్నీ నెరవేర్చే వాగ్దానము చెయ్యి.
నిత్య సుమంగళిగా ప్రియురాలిగా మాతృమూర్తిగా నన్ను తృప్తి చెందనీ! సర్వ మానవాళికి -మన ఇద్దరి అవినాభావ సంబంధము ఉదాహరణగా నిలుచుగాక!! నువ్వే నా బలమని తెలిసి, ఆ బల సామర్థ్యములను ఈ రోజు నిన్ను దర్శించు వారందరు తెలుసుకొందురుగాక! భక్తులకధీనవైన నిన్ను వశముకమ్మని కోరుకుంటున్న. ఈ పవిత్ర సమయంలో నన్నేగాక వచ్చి దర్శనము చేసుకున్న వారందరినీ నీ చల్లని చూపుల దీవెనలతో కాపాడు తల్లీ!
సర్వేజనాః సుఖినోభవంతు!
సీ విజయరాజం,
విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్,
యాదగిరిగుట్ట ఆలయ
పాలకమండలి సభ్యురాలు