కలగానే ఎక్స్‌ప్రెస్ సర్వీస్?
అధిక రద్దీకి తోడు అడుగడుగునా బస్ స్టాపులు
ఒక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణం
గతంలో రోడ్డు సౌకర్యం లేక ఎదురైన కష్టాలే మళ్లీ పునరావృతం
గుండాల, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఎక్స్ప్రెస్ సర్వీసు(Express Services) వస్తుందని ఆశపడ్డారు.. ప్రయాణం సులభతరం అవుతుందని ఎదురుచూశారు.. కానీ మండల ప్రజలకు ఎప్పుడూ నిరాశే మిగులుతుంది. గుండాల మండల(Gundala Mandal) కేంద్రం నుంచి ఇల్లందుకు వెళ్లే ప్రయాణీకుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నా, వాటిని తగ్గించే దిశగా ఆశించిన మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక రద్దీకి తోడు అడుగడుగునా బస్సు స్టాపులతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని ప్రయాణీకులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ ఆశలు.. ఆచరణలో నిరాశే..!
ఇల్లందు డిపో నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసు అందుబాటులోకి వస్తే తక్కువ స్టాపులతో గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చని మం డల ప్రజలు ఆశిస్తున్నారు. ఆర్డినేరి బస్సులతో పోలిస్తే ప్రయాణ సమయం తగ్గి, మండల కేంద్రం నుండి నిత్యం రాకపోకలు సాగించే వారికి ఎంతో ఊరట లభిస్తుందని భావించారు. అయితే ఎక్స్ప్రెస్ సర్వీసుపై పెట్టుకున్న ఆశలు ఇప్పటికీ నెరవేరకపోవడంతో ప్రయాణీకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఒక్కో బస్సులో 120 మందికి పైగా..!
గుండాల నుంచి ఇల్లందు వైపు వెళ్లే బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ తీవ్రంగా ఉంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్క బస్సులోనే 120 మందికి పైగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటే ప్రయాణీకుల ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సీట్లు దొరకక నిలబడే ప్రయాణం చేయాల్సి రావడం, రద్దీలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు పడుతున్న అవస్థలు ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సులో పరిమితికి మించి రద్దీ ఎక్కువ అయితే ప్రయాణ భద్రతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధిక స్టాపులతో విసుగెత్తుతున్న ప్రయాణీకులు
ప్రయాణీకుల రద్దీకి తోడు ఎక్కువ స్టాపుల వద్ద బస్సులు ఆగుతుండటంతో ప్రయాణ సమయం మరింత పెరుగుతోందని మండలవాసులు వాపోతున్నారు. అత్యవసర పనులపై ఇల్లందుకు వెళ్లేవారు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు, చదువుల కోసం ప్రయాణించే విద్యార్థులు ఈ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు అధిక స్టాపులతో అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కష్టాలు మళ్లీ పునరావృతం..!
గతంలో రహదారి సరిగా లేక గుండాల మండల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి సమస్యలతో పడిన అవస్థలు మరువకముందే, ఇప్పుడు బస్సుల రద్దీ, ఎక్కువ నిలుపుదలతో అదే తరహా ప్రయాణ కష్టాలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు సౌక ర్యం మెరుగుపడినా, ప్రజా రవాణాలో తగిన మార్పులు లేకపోతే ప్రయాణీకుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ అధికారులు స్పందించాలి
నిత్యం ఇల్లందు డిపోకు అధిక లాభాలు తెచ్చే గుండాల రూట్ లో మండల ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిపో అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపడంతో పాటు, ఎక్స్ప్రెస్ సర్వీసు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టాలని, ఎక్స్ప్రెస్ సర్వీసుకు మూడు లేదా నాలుగు స్టాపులతో బస్ ను నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అవసరమైన స్టాపులను కొనసాగిస్తూనే, ఆల స్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.