మురుగునీటితో పంటకు ముప్పు!
- మురుగు కాలువకు అడ్డుకట్టతో పొలాల్లోకి చేరుతున్న నీరు!
- ఇబ్బందులకు గురవుతున్న రైతులు
- కొలనుపాకలో అన్నదాతల ఆవేదన..
- అధికారులు సమస్యను
- పరిష్కరించాలని వేడుకోలు
ఆలేరు, అక్టోబర్ 22: కొందరు వ్యక్తులు చేసే స్వార్థపూరిత పనుల వలన సామాన్య రైతులు బలవుతున్న సందర్భాలు ఇటీవల చాలానే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోను మురుగునీటి కాలువకు పదేపదే అ డ్డుకట్ట వేస్తుండటంతో సమీపంలోని పంట పొలాలు సక్రమంగా ఎదగక దిగుబడులు తగ్గి తీవ్రముగా నష్టపోతున్నారని రైతులే స్వ యంగా చెబుతున్నారు. మొత్తానికి మురుగునీరు తమ పంటకు ముప్పుగా మారిందని ఆ రైతులు వాపోతున్నారు.
గతంలో నేరుగా వాగులోకి..
గ్రామంలోని మురుగునీటీ కోసం తీసిన కాలువను గ్రామ సమీపంలోని వాగుకు కలపడం పలితంగా దాని ద్వారా మురుగు నీరు నేరుగా వాగులోకి వెళ్లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే కొంతకాలం క్రితం అలా వెళ్ళే కాలువకు అడ్డుకట్ట వేయడంతో మురుగునీరు పైకి ఉబికి పంట పొలాల్లోకి చేరు తుంది. దీంతో పంట మొక్కలకు సరైన పోషకాలు, ఆక్సిజన్ సక్రమంగా అందక పంట మొక్కలు ఎదగక తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు తెలుపుతున్నారు.
అడ్డంకి తొలగించినా అదే తీరు..
మురుగునీటి సమస్యను పరిష్కరించాల ని అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో రైతుల్లో ఒకరైన సంతోష్ గౌడ్ తన సొంత ఖర్చులతో కాలువలోని అడ్డంకి నుం చి వాగు వరకు మురుగునీరు సాఫీగా వెళ్లే లా చర్యలు చేపట్టినట్లు రైతులు తెలిపారు. దీంతో ఇబ్బంది కొంతకాలం తొలగిపోయినప్పటికీ, ఇటీవల మళ్లీ కాలువకు అడ్డుకట్ట వేయడంతో మురుగునీరు తిరిగి పంట పొలాల్లోకి చేరుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన తమకు మురుగునీటి కార ణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు కనిపించని రైతుల కష్టం!
కాలువ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలువకు అడ్డుకట్ట వేయడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయా? లేక ఇతర సమస్యలు ఉన్నాయా? అనే ప్రశ్నలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని సంబంధిత రైతులు చెబుతుండడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువకు అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని పరిశీలించి, మురుగునీరు వాగులోకి వెళ్లేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
మురుగునీటితో పంటలు దెబ్బతింటున్నాయి..
గ్రామంలోని ము రుగునీటి కాలువకు అడ్డుకట్ట వేయడంతో మా పంట పొలాల్లో కి మురుగునీరు చేరి తీవ్ర నష్టం జరుగుతోంది. పంటల సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాము. మురుగునీటి సమస్యతో పంట మొక్కలు అనుకున్నంత ఎదగకగా దిగుబడులు తగ్గి నష్టపోతున్నాం. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువకు అడ్డంకిని తొలగించి, మురుగునీరు వాగులోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
బర్ల భూమయ్య, బాధిత రైతు