శాంతియుత వాతావరణంలో చవితి వేడుకలు నిర్వహించాలి: కలెక్టర్
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి(Collector Rajarshi) షా కోరారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణహిత నిమజ్జనానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, అగ్నిప్రమాదాలు తదితర ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాలను అధికారుల సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన ప్రదేశాల్లో సురక్షితంగా నిర్వహించాలని సూచించారు.