జలమయంగా మారుతున్న ప్రధాన రహదారి.. పట్టించుకోని పాలకవర్గం

13-09-2026 | 04:31pm

తరిగొప్పుల,సెప్టెంబర్ 13(విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన జనగామ - హుస్నాబాద్ రోడ్డు చినుకు పడితే చాలు జలమయంగా మారుతోందని ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన దారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రోడ్డు పక్కన సరైన మురికి కాలువలు లేకపోవడం, రోడ్డు గుంతలమయంగా మారడంతో కొద్దిపాటి వర్షం కురిసినా నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. 

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయాలపాలవుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి మంగళవారం సంత జరిగే ప్రదేశం పరిస్థితి మరింత దారుణంగా ఉందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. చినుకు పడితే చాలు సంత ప్రదేశం మొత్తం చిత్తడిగా మారి బురదమయంగా తయారవుతోంది. దీంతో కూరగాయలు, ఇతర సరుకులు అమ్ముకునే చిన్న వ్యాపారులు, కొనుగోలుకు వచ్చే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బురదలో నడవలేక, సరుకులు పెట్టుకోలేక నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సమస్యపై పలుమార్లు పాలకవర్గం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జలమయంగా మారుతున్న జనగామ - హుస్నాబాద్ ప్రధాన రహదారికి, మంగళవారం సంత జరిగే ప్రదేశానికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు