పత్తి పంటలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం

11-10-2026 | 09:42pm

రూ.5 లక్షల విలువ.. నిందితుడి అరెస్టు, రిమాండ్

తలమడుగు, అక్టోబర్ 11(విజయక్రాంతి): మండలంలోని అర్లి గ్రామ శివారులో పత్తి పంట మధ్య అక్రమంగా గంజాయి సాగు(Illegal cannabis cultivation) చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వ్యవసాయ భూమిలో పెంచుతున్న 50 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు తలమడుగు ఎస్ఐ డి. రాధిక పోలీసు సిబ్బందితో కలిసి అర్లి శివారులోని వ్యవసాయ భూమిని తనిఖీ చేయగా గంజాయి మొక్కలు బయటపడ్డాయి.

అర్లి గ్రామానికి చెందిన చింతలపల్లి రాజారెడ్డి (65), తన సర్వే నంబర్ 62/A/1లోని 2 ఎకరాల 23 గుంటల భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పంచుల సమక్షంలో మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

గంజాయి సాగు, విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అక్రమ గంజాయి సాగుపై సమాచారం ఉంటే 8412659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు