రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

29-10-2026 | 03:47pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులకు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా రెట్టింపు చేయడంతో పాటు ఉపాధి కూలీలకు 200 రోజుల పని, రోజుకు రూ.800 వేతనం ఇవ్వాలన్నారు. కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.

గిరిజనులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని, సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బండారి రవికుమార్, భూపాల్, దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, టీకానంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు