కాయలు తినేస్తున్నాయి.. కొమ్మలు విరిచేస్తున్నాయి.

02-10-2026 | 08:25pm

తాంసి/భీంపూర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఎల్నినో(Elnino) ప్రభావంతో వర్షాలు కురవక సరైన ఎదుగుదల లేక ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న పత్తి పంటకు అడవి పందుల(Wild boars) బెడద ఎక్కువైంది. రాత్రివేళల్లో పంటచేనుల్లో తిరుగుతూ నష్టం కల్గిస్తున్నాయి. పత్తి చెట్లు, కొమ్మలు విరిచేస్తూ అడుగు భాగంలోని చిన్న సైజు కాయలను సైతం తినేస్తున్నాయి.

చాలామంది రైతులు చేను చుట్టూ పాత చీరలు, వైరు, సోలార్ కంచె ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో టపాసులు పేలుస్తూ పంటను రక్షించుకోవాల్సి వస్తోంది.భీంపూర్ మండలం గోన, ధనోర, గోవింద్ పూర్, అర్లి టి, కారంజి టీ, అంతర్ గావ్,పిప్పల్ కోటి,తో పాటు పలు ప్రాంతాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. పత్తి చెట్టుకు కాసిన మొదటి కాతతో అధిక దిగుబడి వస్తుందని, అలాంటి కాయలనే అడవి పందులు తినేస్తుండటంతో ఎకరానికి ఒకటి,రెండు క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుందని గోవింద్ పూర్ రైతులు కథ్లే జ్యోతిరం,వెట్టి కృష్ణ లు తెలిపారు..

మరిన్ని వార్తలు