5 September, 2026 | 1:49 PM

ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలి: జాన్సన్ నాయక్

05-09-2026 | 12:29pm

ఉట్నూర్‌, సెప్టెంబర్‌ 05 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీల(420 guarantees)ను అమలు చేయడంలో ప్రజాపాలన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌(Johnson Nayak) ఆరోపించారు.

శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు మారుతి డోంగ్రే ఆధ్వర్యంలో మండలంలోని అంజి, సమక, ఇంద్రవెల్లి, హీరాపూర్‌, హార్కాపూర్‌ తదితర గ్రామాల నుంచి యువత, మహిళలు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులు, గ్రామాల పటేల్‌లు, బీజేపీ( BJP ), కాంగ్రెస్‌ పార్టీల( Congress parties) నుంచి చేరిన వారిని బీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారు.

ఈ సందర్భంగా జాన్సన్‌ నాయక్‌(Johnson Nayak) మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు గ్రామాల బాట పట్టి ప్రజలను చైతన్యం చేయవలసిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. ప్రతి కార్యకర్త గుండెల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని జాన్సన్‌ నాయక్‌ భరోసా కల్పించారు.

ప్రతి కార్యకర్త కంకణబద్ధులై గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రతి ఒక్కరికీ వివరించవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దేవుడిపై ప్రమాణం చేసి దేవుడిని మోసం, ప్రజలను మోసం చేస్తుందని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త కంకణబద్ధుడై పార్టీ కోసం పనిచేయాలని కోరారు.

ఇంద్రవెల్లి మండలంలోని ఓటర్లు గత ఎన్నికల్లో పదివేలకు పైగా ఓట్లు వేసి తనను ఆశీర్వదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి బీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇప్పటినుంచే కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుంర్రా ఈశ్వరి, పార్టీ నాయకులు జిల్లాని బేగ్‌, సుపియన్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు