పల్లెటూరి బిడ్డకు జాతీయ కిరీటం

25-09-2026 | 03:36pm

మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026'గా ఆదిలాబాద్ యువతి ప్రీతి ముండే...

ఉట్నూర్, సెప్టెంబర్25 ( విజయక్రాంతి ): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని  హీరపూర్ గ్రామానికి (Heerapur village)చెందిన ప్రీతి ముండే(Priti Munde) జాతీయ స్థాయి అందాల పోటీల వేదిక వరకు సాగింది. యువతి ప్రయాణం  ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే ప్రతిష్టాత్మక 'మిస్ డివైన్ బ్యూటీ'(Miss Divine Beauty) సంస్థ రాజస్థాన్‌లోని జైపూర్‌ ఇంటర్నేషనల్ హోటల్‌లో నిర్వహించిన 'మిస్ ఇండియా ఎర్త్ 2026' పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి జాతీయ స్థాయి వేదికపై సత్తా చాటిన ఆమె..త్వరలో ఫిలిప్పీన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ 'మిస్ ఎర్త్' వేదికపై భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోటీల్లో ప్రీతి ముండే  ప్రదర్శించిన ప్రతిభ, స్నేహపూర్వక తీరుకు గాను ఆమెకు 'మిస్ కంజీనియాలిటీ 2026' సబ్‌టైటిల్ పురస్కారాన్ని దక్కించుకుంది.

ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 'కామాక్షి టెక్స్‌టైల్స్ & డ్రెస్సెస్' పేరిట చిన్నపాటి వస్త్ర వ్యాపారం చేసుకునే ప్రహ్లాద్- ఉమా ముండే దంపతుల కుమార్తె ముండే  ప్రీతి, నిరుపేద, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. కేవలం మోడలింగ్‌కే పరిమితం కాకుండా అరోరా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ఇన్ యోగా అభ్యసిస్తూ, జాతీయ స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై తన క్రీడా ప్రతిభను నిరూపించుకున్నారు. గతంలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందిన ఆమె, కేంద్ర ప్రభుత్వ 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' విభాగంలో యోగా శిక్షకురాలిగా సేవలందించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్స్‌లో యోగా టీచర్‌గా, ప్రొఫెషనల్ జ్యోతిష్యురాలిగా, యువ పారిశ్రామికవేత్తగా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నారు.

మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సేవకురాలిగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రీతి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 'కైండ్ హార్ట్స్' పేరిట సొంతంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పాఠశాల విద్యార్థుల్లో చైతన్యం నింపడం, చెత్త విభజన, పరిసరాల పరిశుభ్రత, చెరువుల పునరుద్ధరణ, సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తూ నిజమైన పర్యావరణ వేత్తగా గుర్తింపు పొందారు.

పల్లెటూరి వీధుల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రీతి ముండే విజయంపై గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. తమ కూతురు జాతీయ స్థాయిలో 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' కిరీటాన్ని కైవసం చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు సైతం హర్షం చేస్తున్నారు. ప్రీతి తన లక్ష్యం కోసం తపన పడుతున్న విధానాన్ని తాము గమనిస్తూ ఎల్లవేళలా తనకు అండగా ఉంటూ కృషి చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు