ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం చేయాలి

02-11-2026 | 12:00am

-1/70 చట్టం సవరణ ప్రతిపాదనపై అప్రమత్తంగా ఉండాలి

ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర నాయకులు

మణుగూరు, నవంబర్ 1 (విజయక్రాంతి): ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులు, చట్టాలు, భూమి, ఉపాధి అవకాశాల పరిరక్షణకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర నాయకులు సోయం కామరాజు(Adivasi leaders Soyam Kamaraju), చీమల సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం మణుగూరులోని హనుమాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు సొందే మల్లూరు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలంటూ గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆదివాసీ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జీవో నెంబర్ 3 రద్దు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 2011లో ఎస్టీ జాబితా అంశంపై హైకోర్టులో దాఖలైన కేసులో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని కోరారు. ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం ఆదివాసీ సంక్షేమ పరిషత్‌, ఆదివాసీ టీచర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా న్యాయపోరాటం, ఉద్యమాలు కొనసాగిస్తాయని తెలిపారు. అనంతరం ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాయం రంగారావు, జిల్లా కార్యదర్శిగా మెర్సు వసంత్ లను నియమించారు.

ఈ సమావేశంలో ఆదివాసీ టీచర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజర్‌ సోలం వీరస్వామి, సింగ రవిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింత ఉపేందర్‌, ఉపాధ్యక్షుడు కుర్సం రవి, సంయుక్త కార్యదర్శి సోలం హరిశంకర్‌, మహిళా కార్యదర్శి బుటారి నాగమణి, టీచర్స్ అసోసియేషన్ నాయకులు పూనెం వెంకటేశ్వర్లు, పూనెం రామకృష్ణ, వట్టం రామచంద్ర, మడి రమేష్,  వివిధ మండలాల నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు