తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
- ప్రకృతిని పూజించే విశిష్టమైన పండుగ
- కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Koonamneni Sambasiva Rao ) అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూలను పూజించి, ప్రకృతితో మమేకమయ్యే గొప్ప సాంస్కృతిక వారసత్వం మన ప్రాంతానికి ఉందని పేర్కొన్నారు.
ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో ఆడిపాడే ఈ పండుగ సమాజంలో ప్రేమానురాగాలను, ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. నేటి ఆధునిక కాలంలోనూ మన ప్రాచీన సంస్కృతి, జీవన విధానాలను కాపాడుకుంటూ భావితరాలకు సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతోనే సమాజ పురోగతి ముడిపడి ఉందని,
కార్పొరేషన్ పరిధిలోని సమస్యల పరిష్కారంలోనూ మహిళా ప్రజాప్రతినిధులు ముందుండాలని సూచించారు. అనంతరం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, డిప్యూటీ మేయర్ లలిత, కమిషనర్ సుజాత, మహిళా కార్పొరేటర్లు మునిగడప పద్మ, గడ్డం శాంతి ప్రియ, సుజాత, లక్ష్మి, కీర్తి, శ్యామల, ధనలక్ష్మి, సునీత, హిమశ్రీ, పడాల ఆకాంక్ష, మెప్మా సభ్యులు, కార్పొరేషన్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.