జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

16-10-2026 | 11:12pm

కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్.

ఆలేరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ(Yadadri Bhuvanagiri District Police Department) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్(District SP Akshansh Yadav) ఐపీఎస్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ మహిళలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటారు. పోలీస్ కుటుంబాల మధ్య ఆత్మీయత, ఐక్యతను పెంపొందించేలా వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పండుగలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పోలీస్ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాలు పోలీస్ కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయి.

మరిన్ని వార్తలు