మద్దతు ధర విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తున్నాము

27-10-2026 | 06:31pm

సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులను ఒప్పించి ఎస్సారెస్పీ నీరు ఇప్పించి పంటలు కాపాడాను

రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

సుల్తానాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రైతులకు సాగునీరు అందించడం, మద్దతు ధరల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయడం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ల ను ఒప్పించి పది రోజులు ఎస్ఆర్ఎస్పి నీరు ఇప్పించి పంటలను కాపాడడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijayaramana Rao) అన్నారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యాలు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి  రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగిల్ విండో మరియు ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

దళారుల కు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు,  రైతుకు బయట అధిక ధర వస్తే అక్కడ కూడా అమ్ముకోవచ్చని అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో కూడా అమ్ముకోవచ్చని ఇది రైతు ఇష్టమని  విజయరమణ రావు అన్నారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లు అమ్ముకున్న రైతుకు క్వింటాలకు 2,462 రూపాయల మద్దతు ధరతో వడ్లు అమ్ముకున్న 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ అందిస్తుందని అన్నారు. బోనస్ తో కలుపుకొని రైతుకు క్వింటాలుకు రూ. 2962 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.

తూకం విషయంలో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ఇంచార్జీలు రైతులను ఇబ్బంది పెడితే తొలగించడం జరుగుతుంది అన్నారు. తుఫాను ప్రభావం ఉందని రైతులు పంటలు కోసిన తర్వాత పంటలు తడవకుండా పాలిథిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు. సూపర్ ఎల్ నీఓ ప్రభావం ఉన్న కారణంగా రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, వ్యవసాయ బావిలో నీరు ఉంటే ఒక ఎకరంకు వరి పారే నీటిని రెండున్నర ఎకరాల మొక్కకుఉపయోగించుకోవచ్చని, రైతులు ఎలాంటి పంట నష్టపోకుండా వేసవికాలంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి అన్నారు,ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ చిలక సతీష్ తో పాటు ప్రజాప్రతినిధులు, రైతులు,  నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మరిన్ని వార్తలు