మంత్రాల భయంతో మరో విషాదం
- భార్యాభర్తలు ఆత్మహత్య
- ఇద్దరి మృతితో గ్రామంలో భయాందోళనలు
- కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు సేవించిన దంపతులు
- తొలుత భార్య సునీత మృతి.. చికిత్స పొందుతూ భర్త రాంబాబు మృతి
మణుగూరు, నవంబర్ 12(విజయ క్రాంతి ): మంత్రాలు(Mantras), క్షుద్రపూజల పేరుతో(black magic)చోటుచేసుకున్న వరుస మరణాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మండలంలోని బుడుగుల గ్రామంలో(Budugula Village) ఇటీవల పూజలు నిర్వహించేందుకు వెళ్లిన మాసయ్య, భీమయ్య ఇద్దరూ మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనతో గ్రామంలో తమను కూడా మంత్రాలతో చంపేస్తారేమోనన్న భయం కొందరిలో నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాసయ్య కుమారుడు రాంబాబు, కోడలు సునీత మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.
తీవ్ర మనస్తాపానికి గురైన సునీత పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురైన భర్త రాంబాబు కూడా పురుగుమందు సేవించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాంబాబు సైతం మృతి చెందాడు.ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మంత్రాల భయం, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ వరుస ఘటనలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయం పోలీసులకు గ్రామస్తుల సమాచారం ఇవ్వడంతో గ్రామాల్లో పర్యటించి ఘటనపై సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ విచారణ చేపట్టారు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా...?
నేడు కంప్యూటర్ యుగంలో ఎంతోమంది టెక్నాలజీ పెరిగిన మూఢనమ్మకాల వైపు పరిగెత్తుతున్నారు. ఏదో జరిగిందంటూ మారమూల గ్రామాలలో కొంతమంది మంత్రగాలను కలుస్తూ, పూజలు చేయించుకుంటున్నారు. బడుగుల గ్రామంలో జరిగిన వరుస ఘటనలు చర్చ నియాంశంగా మారాయి. అధికారులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించిన కూడా మారుమూల గ్రామాలలో క్షుద్ర పూజలు నమ్ముతున్నారు.