హేమంత్‌కు ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. ఏం జరుగుతుందో

12-11-2026 | 03:28pm

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు హేమంత్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ‘పల్మనరీ ఎంబాలిజం’ (Pulmonary Embolism) అనే తీవ్రమైన సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజుల క్రితం హేమంత్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఆయాసంతో ఆసుపత్రి బెడ్‌పై నుంచి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన సీటీ స్కాన్ (CT Scan)లో ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దీంతో వెంటనే అవసరమైన మందులు అందిస్తూ చికిత్స ప్రారంభించారు.

సాధారణంగా పెద్ద శస్త్రచికిత్సల తర్వాత తలెత్తే అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో ‘పల్మనరీ ఎంబాలిజం’ ఒకటని వైద్యులు చెబుతున్నారు. గతంలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు కుడికాలు తొలగింపు శస్త్రచికిత్స (Amputation Surgery) జరిగింది. ఈ సమస్య కారణంగా శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి విషమిస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

మరిన్ని వార్తలు