గజగజ వణికిస్తున్న చలి

12-11-2026 | 09:36am

హైదరాబాద్‌: నగర ప్రజలను చలిపులి వణికిస్తోంది. పగటిపూట ఎండ తీవ్రత కనిపిస్తున్నప్పటికీ.. రాత్రి, తెల్లవారుజామున మాత్రం చల్లని గాలులు నగరవాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో Temperature భారీగా పడిపోతోంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఏకంగా 4.8 డిగ్రీలు తక్కువ. పటాన్‌చెరులో 12.6, కుత్బుల్లాపూర్‌లో 14.1, శేరిలింగంపల్లిలో 14.2, కూకట్‌పల్లిలో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అమీన్‌పూర్‌లో 14.9, బీహెచ్‌ఈఎల్‌లో 15.1, దుండిగల్‌లో 15.9, హకీంపేటలో 17 డిగ్రీలు నమోదయ్యాయి.

మరోవైపు హైదరాబాద్ నగర సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదైంది. అంటే నగర కేంద్రంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అంబర్‌పేట, చార్మినార్ వంటి రద్దీ ప్రాంతాల్లో పగటిపూట ఎండ ప్రభావం కనిపిస్తున్నా.. రాత్రి వేళల్లో పరిస్థితి మారిపోతోంది. రానున్న రోజుల్లో Night Temperature సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో చలి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు చల్లని గాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని వార్తలు