10 సంవత్సరాలుగా పోరాడిన ప్రజలకు న్యాయం చేయండి
ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి
పాల్వంచ (విజయక్రాంతి): గాంధీనగర్ ఏరియాలో 2017 నుండి ఇప్పటి వరకు ఇంటి స్థలం కోసం దశలవారీగా పోరాటంలో పాల్గొన్న నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి పీ తులసీరామ్(CPM Town Secretary Tulasiram) విజ్ఞప్తి చేశారు. ఆదివారం పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యురాలు కే సత్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత వారం రోజులుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆక్రమించుకొని ఉంటున్న లబ్ధిదారులను అధికారులు కలిసి అర్హులైన వారిని గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు.
ఆరు నెలల క్రితం ఉన్నతాధికారులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని లేదంటే ప్రజలకు అధికారుల మాటమీద నమ్మకం కోల్పోతారన్నారు. హడావుడిగా లక్కీ డ్రా తీసి కొంతమందికి ఇవ్వడం వలన ప్రభుత్వమే పేదల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తుందని ఇది మంచివిధానం కాదన్నారు. ఇప్పటికైనా పోరాటంలో ఉన్న పేదలను పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, లేదంటే ఎంతటి పోరాటానికైనా పేదలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు సత్యవాణి, ఎస్ కే నిరంజన్, కమిటీ సభ్యులు బి కాంతి సులోచన బి మాధవి వింజరాములు తదితరులు పాల్గొన్నారు