యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలి

22-10-2026 | 08:03pm

ఏ ఓ శీలం చంద్ర శేఖర్ రెడ్డి

దమ్మపేట, అక్టోబర్ 22(విజయ క్రాంతి): దమ్మపేట మండలంలోని మల్లారం రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao ) రైతులతో మాట్లాడారు. సాగు భూమి సంరక్షణ కార్యక్రమం, రాబోయే యాసంగి సీజన్‌లో ఎల్ నినో ప్రభావం కొనసాగి వర్షపాతం,

నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని, నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగును వీలైనంత వరకు నివారించాలని సూచించారు.

సాగునీటి లభ్యత, భూగర్భ జలమట్టం, నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు చేపట్టాలని సూచించారు. నీటి కొరత ఏర్పడే పరిస్థితుల్లో పంటలకు నష్టం కలగకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికతో సాగు చేయడం అవసరమని పేర్కొన్నారు.

యాసంగి సీజన్‌లో రైతులు శనగ, పెసర, మినుము, వేరుశనగ, కూరగాయలు మరియు పామాయల్ వంటి తక్కువ నీటి అవసరం కలిగిన పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పంటల ఎంపికకు ముందు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల వ్యవసాయ అధికారి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు